సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

  • Published By: bheemraj ,Published On : November 8, 2020 / 03:24 AM IST
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Diwali bonus : సింగరేణి గని కార్మికులకు యాజమాన్యం మరో తీపి కబురు అందించింది. దీంతో దీపావళికి వారం ముందే సింగరేణిలో వెలుగులు విరజిమ్మాయి. దీపావళి సమయంలో అధికారులు కాకుండా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి పెర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ రివార్డ్‌ స్కీంలో భాగంగా ఇచ్చే బోనస్‌ను యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది ఒక్కొక్కరికి రూ.68,500 చొప్పున ఈ నెల 12 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.



దీనికి సంబంధించి సింగరేణి కాలరీస్‌ కంపెనీ కార్పొరేట్‌ పర్సనల్‌ విభాగం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కోల్‌ ఇండియా కార్మికులు (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌)తో సమానంగా సింగరేణి కార్మికులకు కూడా దీపావళి బోనస్‌ ఇవ్వాలని సంయుక్త ప్రతినిధులతో ఏర్పాటైన కమిటీ (జేబీసీసీఐ)నిర్ణయించింది. గత నెలలోనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సిబ్బందికి లాభాల్లో వాటా ఇచ్చారు.



2019-20 సంవత్సరానికి సంబంధించి 28 శాతం వాటా రూ.278.28 కోట్లను ఒక్కో కార్మికుడికి రూ.60,468 చొప్పున పంపిణీ చేశారు. తాజాగా దీపావళి బోనస్‌ను కూడా ప్రకటించడంతో సింగరేణి ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి బోనస్‌ కింద ఇవ్వనున్న రూ. 68,500 మొత్తం ఉద్యోగి బేసిక్‌పేతో సంబంధం లేకుండానే అందరికీ (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ సిబ్బంది) అందించనున్నారు.



నాన్‌ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సింగరేణిలో సుమారు 43 వేల మంది ఉన్నారు. సింగరేణిలో ఉన్న సుమారు 2 వేల మంది అధికారవర్గానికి అందించాల్సిన పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే (పీఆర్‌పీ) బకాయిలలు త్వరలోనే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.