దీపావళి ఎఫెక్ట్ : హైదరాబాద్ లో భారీగా పెరిగిన పొల్యూషన్

  • Published By: madhu ,Published On : November 15, 2020 / 09:53 AM IST
దీపావళి ఎఫెక్ట్ : హైదరాబాద్ లో భారీగా పెరిగిన పొల్యూషన్

Increased Pollution in Hyderabad : హైదరాబాద్‌లో దీపావళినాడు టపాసుల మోత తగ్గినా కాలుష్యం మాత్రం పెరిగిపోయింది. పండుగ ఎఫెక్ట్‌తో ఒక్కరోజులోనే కాలుష్యం రెట్టింపైంది. శనివారం గాలిలో కాలుష్య తీవ్రత 57 AQI పాయింట్లు ఉండగా… 2020, నవంబర్ 15వ తేదీ ఆదివారం 106 పాయింట్లుకు చేరుకుంది. శనివారం రాత్రి కాలుష్య తీవ్రత 160 పాయింట్ల వరకూ వెళ్లినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు గతేడాదితో పోల్చితే హైదరాబాద్‌లో ప్రమాదాలు తగ్గిపోయాయి.



సరోజినీదేవి, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రుల్లో తక్కువ కేసులు నమోదయ్యాయి. కంటి గాయాలతో సరోజినీదేవి ఆస్పత్రిలో ఇద్దరికి… ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో మరో 9 మందికి చికిత్స అందించారు. వీరందరికీ చిన్న గాయాలే అయినట్లు డాక్టర్లు చెప్పారు.



దీపావళి అంటేనే దీపాల వెలుగులు, టపాసుల మోతలు. ఉదయం పూజలు చేసిన తర్వాత సాయంత్రం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతుంటే..కాలుష్యం కూడా అధికమౌతోంది. ఈ క్రమంలో…దీపావళి వేడుకలపై బాణాసంచాపై హైకోర్టు నిషేధం విధించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం పటాకులు కాల్చొద్దని, విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది.



కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రంలో బాణా సంచా కాల్చటంపై ఉన్ననిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రాకర్స్ కాల్చే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును మారుస్తూ దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చు కునేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణలో గాలి నాణ్యత సాధారణంగా ఉండటంతో రెండు గంటలపాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు సుప్రీం అనుమతిచ్చింది. దీంతో ఉన్న కొద్దిగంటల్లో టపాసుల విక్రయాలు జరిగాయి.