దీపావళి నోములు ఆదివారమే!

  • Published By: madhu ,Published On : November 13, 2020 / 06:47 AM IST
దీపావళి నోములు ఆదివారమే!

Diwali Nomulu are on Sunday! : దీపావళి పర్వదినం వచ్చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దీపావళి నాడు హారతులు ఇచ్చే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పుట్టింటికి వచ్చిన ఆడకూతుళ్లు ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ హారతులు ఇవ్వడం ఆనవాయితీ. సూర్యోదయానికి ముందు చేసుకుంటుంటారు. ఈ పర్వదినం సందర్భంగా..నోములు, లక్ష్మీ పూజలు, వ్రతాలు చేసుకుంటుంటారు.



రెండు రోజులు :-
అయితే..ఏటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ..ఈసారి రెండు రోజుల పాటు వచ్చింది. అమావాస్య తిథి శని, ఆదివారాల్లో ఉందని, అంటే..రెండు రోజుల పండుగా మారిందని పండితులు వెల్లడిస్తున్నారు. దీంతో శనివారం రోజున హారతులు, లక్ష్మీ పూజలు, నోములు ఆదివారం చేసుకోవాలని సూచిస్తున్నారు.



చతుర్దశి, అమావాస్య :-
అశ్వీయుజ బహుళ చతుర్ధశి, అమావాస్య తిథులు శనివారం కలిసి వచ్చాయి. శనివారం చతుర్దశి తిథి పగలు 1.35 గంటల వరకు, తర్వాత అమావాస్య తిథి ప్రవేశిస్తోందంటున్నారు. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండడంతో దీపావళి శనివారమే చేసుకోవాలని, అమావాస్య తిథి ఆదివారం ఉదయం 11.15 గంటల వరకు ఉందని, ఈ రోజు వత్రాలు చేసుకోవాలని వెల్లడిస్తున్నారు.



దుర్ముహూర్తం వెళ్లిన తర్వాత హారతులు :-
సూర్యోదాయానికి ముందు హారతులు ఇవ్వడానికి కుదరని పక్షంలో దుర్ముహూర్తం వెళ్లిపోయిన తర్వాత ఇవ్వొచ్చని వెల్లడిస్తున్నారు. దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి 1.36 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం అయ్యాక..అంటే..1.36 గంటల తర్వాత హారతులు ఇవ్వొచ్చంటున్నారు.



లక్ష్మీ పూజలు :-
ఈ పండుగ విశేషాల్లో లక్ష్మీ పూజలు ప్రధానమైంది. సాయంత్రం లక్ష్మీ దేవికి పూజలు చేస్తుంటారు. వ్యాపారుస్తులు దుకాణాల్లో పూజలు చేసి కొత్త ఖాతా పుస్తకాన్ని తెరుస్తుంటారు. రాత్రి పూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం లక్ష్మీ పూజలు నిర్వహించుకోవాలంటున్నారు.



నోములు :-
ఇక నోముల విషయానికి వస్తే..సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండాలని, శనివారం సూర్యోదయానికి అమావాస్య తిథి లేదని..శనివారం కేదారేశ్వర నోములు చేసుకోకూడదని వెల్లడిస్తున్నారు. సూర్యోదయానికి అమావాస్య తిథి ఆదివారం నాడు ఉండడంతో అదే రోజు నోములు చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.