దీక్షిత్ రెడ్డి హత్య కేసు విచారణ, ఏం తేల్చారు ? బాలుడి బాబాయి మనోజ్‌ రెడ్డి పాత్ర ఉందా ?

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 07:40 AM IST
దీక్షిత్ రెడ్డి హత్య కేసు విచారణ, ఏం తేల్చారు ? బాలుడి బాబాయి మనోజ్‌ రెడ్డి పాత్ర ఉందా ?

Dixit Reddy murder case :తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ రెడ్డి కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఈ కేసులో కేవలం సాగర్‌కు మాత్రమే సంబంధం ఉందని పోలీసులు తేల్చినప్పటికీ…నిందితుడి గత నేర చరిత్ర, అతని మానసిక స్థితి, టెక్నాలజీ పరంగా అతనికి ఉన్న నైపుణ్యతపై ప్రజల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..సాధ్యమైనంత వరకు సాగర్ ఒక్కడే చేసి ఉండకపోవచ్చనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.



నాలుగు రోజులుగా విచారణ : –
నిందితుడ్ని గత నాలుగు రోజులుగా విచారిస్తున్న పోలీసులు..హత్యకు సంబంధించి పలు అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు. మొదట బాలుడి ఇంటి సమీపంలో సాగర్ ఏర్పాటు చేసుకున్న ఆటోమొబైల్ షాపు తాళాలు పగలగొట్టి అందులో కీలక ఆధారాలు సేకరించారు. అలాగే…ఆ షాపు పక్కనే ఉండే మరో షాపుకు సంబంధించిన వ్యక్తితో సాగర్‌ సాన్నిహిత్యంపై విచారించారు. అలాగే..వివిధ యాప్‌ల ద్వారా కిడ్నాప్‌కు ప్లాన్ చేయడంపై సాంకేతిక అంశాలపై క్లారిటీ తీసుకున్నారు.



రూ. 45 లక్షలే ఎందుకు : –
అయితే కిడ్నాప్ సమయంలో ప్రత్యేకంగా 45 లక్షలే డిమాండ్‌ చేయడంపైనే పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేశారు. కేవలం డబ్బు మాత్రమే నిందితుడి టార్గెట్‌ కాకపోవచ్చని, డబ్బులే కావాల్సి ఉంటే హత్య చేయకపోయేవాడనే కోణంలో పోలీసులు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరితో మందితో కలిసి ప్లాన్‌ చేశారని, దీక్షిత్‌ సమాచారం ఇచ్చిన దగ్గరి వ్యక్తికి 15 లక్షలు, మిగిలిన వారు 10లక్షల చొప్పున తీసుకునేలా నిర్ణయించుకుని ఉంటారని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసుల విచారణ కొనసాగుతోంది.



https://10tv.in/several-doubts-in-deekshith-reddy-kidnap-murder-case/
ఐ డోంట్‌ వాంట్‌ ఏ ఫర్‌ఫెక్ట్‌ లైఫ్‌…ఐ వాంట్‌ ఏ హ్యాపీ లైఫ్ : –
నిందితుడు సాగర్‌ ఇద్దరు బావలు పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తానని సాగర్‌ పదేపదే చెప్పేవాడట. అందులో భాగంగానే ఈజీమనీ కోసం యూట్యూబ్‌ ద్వారా నిరంతరం టెక్నాలజీ మీద పట్టు సాధించినట్లు తెలుస్తోంది. ఇది నిజమేనా అనే సందేహాలపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. నిజంగా సాగర్ ఆలోచనలన్నీ అలానే ఉండేవా? సొంత గ్రామం శనిగపురంలో ఏం చేసేవాడనే విషయాలపై పూర్తి స్థాయి విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఐ డోంట్‌ వాంట్‌ ఏ ఫర్‌ఫెక్ట్‌ లైఫ్‌…ఐ వాంట్‌ ఏ హ్యాపీ లైఫ్‌’ అంటూ సాగర్‌ తన ఫేస్‌బుక్‌లో రాసుకున్న వ్యాఖ్యలపై సైబర్ టీం విచారణ చేస్తోంది.



ముగియనున్న కస్టడీ గడువు : –
ఇక హత్య జరిగిన దానవయ్య గుట్టతో సహా పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అలాగే దీక్షీత్ బాబాయి మనోజ్ రెడ్డి హత్యకు సహకరించి ఉంటాడా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అనుమానితులతో పాటు సాగర్‌ ఫోన్‌ కాల్ లిస్ట్‌ మీద పోలీసులు ఫోకస్ చేశారు. దీక్షిత్ తల్లితండ్రుల ఫోన్ కాల్‌ లిస్ట్‌లను కూడా పరిశీలిస్తున్నారు. సాగర్‌కు స్లీపింగ్ ట్యాబ్లేట్లు ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే 2020, అక్టోబర్ 31వ తేదీ శనివారం మధ్యాహ్ననికి కస్టడీ గడువు ముగియనుంది.



న్యాయం చేయాలంటున్న దీక్షిత్ ఫ్యామిలీ : –
ఈ కస్టడీ సమయంలో పోలీసులు ఏ విషయాలు రాబట్టారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. విచారణ అనంతరం పోలీసులు మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు మాత్రం నిందితుడికి వేసే శిక్ష…నేరస్తులకు ఓ గుణపాఠంలా మారాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడ్ని వెంటనే శిక్షించాలని, పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అంటున్నారు. మరి ఈ విచారణ అనంతరం ఏం జరుగుతుందో చూడాలి.