ఒక్కరోజు కరోనా చికిత్సకు రూ.1.15లక్షల బిల్లు, ప్రభుత్వ డాక్టర్ నిర్బంధం, హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీ, దౌర్జన్యం

  • Published By: naveen ,Published On : July 5, 2020 / 02:21 PM IST
ఒక్కరోజు కరోనా చికిత్సకు రూ.1.15లక్షల బిల్లు, ప్రభుత్వ డాక్టర్ నిర్బంధం, హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి దోపిడీ, దౌర్జన్యం

హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని తుంబే(Thumbay Hospital New Life) ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ఆ ఆసుపత్రి పేషెంట్లను నిలువునా దోపిడీ చేస్తోంది. కరోనా ట్రీట్ మెంట్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఒక్కరోజు కరోనా ట్రీట్ మెంట్ కు అక్షరాల రూ.1.15లక్షల బిల్లు వేశారు. ఇంత బిల్లు ఎందుకు వేశారని ప్రశ్నించగా, బాధితురాలని రూమ్ లో నిర్బంధించారు.

అంత బిల్లు ఎందుకు అని ప్రశ్నించినందుకు నిర్బంధం:
తుంబే ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ ను నిర్బంధించిన ఘటనతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానాను తుంబే ఆసుపత్రి యాజమాన్యం నిర్బంధించింది. కరోనా వారియర్ గా పని చేస్తున్న డాక్టర్ సుల్తానా మూడు నెలలుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కూడా కరోనా బారిన పడ్డారు. ఏ ఆసుపత్రిలోనూ బెడ్లు లేకపోవడంతో, తన ఇంటికి దగ్గరలోనే ఉన్న తుంబే ఆసుపత్రిలో సుల్తానా చేరారు. అదే ఆమె పాలిట శాపమైంది. ఒక్కరోజు కరోనా ట్రీట్ మెంట్ కు తుంబే ఆసుపత్రి యాజమాన్యం లక్షన్నర బిల్లు వేయడంతో సుల్తానా కంగుతిన్నారు. ఇంత బిల్లు ఎందుకు వేశారని ప్రశ్నించగా, ఆమె పట్ల తుంబే ఆసుపత్రి యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. ఆమెని ఓ రూమ్ లో నిర్బంధించారు. బిల్లు కట్టాకే డిశ్చార్జి చేస్తామన్నారు.

వైద్యం ఆపేశారు.. భోజనం, ఇన్సూలిన్ కూడా ఇవ్వడం లేదు, ప్రభుత్వ డాక్టర్ కంటతడి:
అంతేకాదు ఆమెకు ట్రీట్ మెంట్ కూడా నిలిపేశారు. భోజనం కూడా పెట్టడం లేదు. ఇన్సూలిన్ కూడా ఇవ్వడం లేదు. సుల్తానా డయాబెటిక్ పేషెంట్ కూడా. తనను రూమ్ లో నిర్బంధించారని కంటతడి పెడుతూ ఆమె సెల్ఫీ వీడియో రికార్డు చేసి బయటకు పంపారు. దీంతో తుంటే ఆసుపత్రి యాజమాన్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎక్కడా బెడ్లు లేకపోవడంతో తన ఇంటికి దగ్గరలోనే ఉన్న తుంబే ప్రైవేట్ ఆసుపత్రిలో తాను చేరానని సుల్తానా తెలిపారు. తాను ఒక ప్రభుత్వ డాక్టర్ ని, కరోనా వారియర్ ని, తన పట్లే ఆసుపత్రి యాజమాన్యం ఇంత దారుణంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎంవోగా పని చేస్తున్న డాక్టర్ పట్లే తుంబే ఆసుపత్రి యాజమాన్యం ఈ విధంగా క్రూరంగా వ్యవహరిస్తే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిని జనాలు వాపోతున్నారు.

కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ.. వారం రోజుల ట్రీట్ మెంట్ కే రూ.7లక్షల బిల్లు:
హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా పేరుతో జనాలను ఏ విధంగా దోచుకుంటున్నాయో చెప్పడానికి తుంబే ఆసుపత్రి ఒక ఉదాహరణ అంటున్నారు. నగరంలో ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రులు అనేకం ఉన్నాయని, కరోనా ట్రీట్ మెంట్ పేరుతో రోగులను దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని చాలా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పేరుతో 4,5 రోజులకే 8 లక్షల రూపాయలు చార్జి చేస్తున్నాయి. తనను నిర్బంధించారని ఏడుస్తూ ఒక డాక్టరే స్వయంగా ఇలా వీడియోలో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అందరిని ఆవేదనకు గురి చేస్తోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి కరోనా ట్రీట్ మెంట్ పేరుతో జనాలను దోపిడీ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.