అనారోగ్య లక్షణాలు ఉంటే డ్యూటీకి రావొద్దు : జీహెచ్ ఎంసీ కమిషనర్

  • Published By: bheemraj ,Published On : June 9, 2020 / 08:03 PM IST
అనారోగ్య లక్షణాలు ఉంటే డ్యూటీకి రావొద్దు : జీహెచ్ ఎంసీ కమిషనర్

దగ్గు, జ్వరం, అనారోగ్య లక్షణాలు ఉంటే డ్యూటీకి రాకూడదని, వస్తే వెంటనే ఇంటికి పంపించి తగ్గిన తర్వాతే విధులకు అనుమతివ్వాలని  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అన్నారు. లిఫ్టు, ఏసీ, బయోమెట్రిక్‌ వాడకూడదని ఉద్యోగులను ఆదేశించారు. కార్యాలయంలో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చినందుకు ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు పాటించాల్సిన, పాటించకూడని నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేస్తూ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఉద్యోగులు ఒకే చోట గుమిగూడరాదని.. మూడు నుంచి ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని స్పష్టం చేశారు.

లిఫ్టులు, ఏసీల వాడకాన్ని సాధ్యమైనంత వరకు మానుకోవాలి 
లిఫ్టులు, ఏసీల వాడకాన్ని సాధ్యమైనంత వరకు మానుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఉద్యోగులకు సూచించారు. బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని సైతం ఉపయోగించకూడదని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు పలు మార్గదర్శకాలను మంగళవారం (జూన్ 9, 2020) జారీచేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటిని ఉద్యోగులంతా తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా జర్వం, దగ్గు, జలుబు తదితర అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే వారిని ఇంటికి పంపి, అన్నీ తగ్గిన తరువాతే విధులకు అనుమతించాలని స్పష్టం చేశారు. 

చేయకూడని పనులు
బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని మానుకోవాలి. ఏసీలు వీలైనంతవరకు వాడకపోవడం మంచిది. లిఫ్ట్‌లను వాడకూడదు. ఉద్యోగులు ఒకేచోట గుమిగూడరాదు. కనీసం మూడు, వీలైతే ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి. జ్వరం, దగ్గు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి దగ్గరగా ఉండవద్దు. సమావేశాలను వీలైనంత వరకు ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాలి.
ఆహారం పాత్రలు, కప్పులు, నీటి సీసాలు ఇతరులతో పంచుకోరాదు. 

చేయాల్సిన పనులు
రోజూ కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరి జ్వరం టెంపరేచర్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉంటే అవి తగ్గేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని చెప్పాలి. టేబుల్స్‌, డోర్‌ హ్యాండిల్స్‌, హ్యాండ్‌ రేలింగ్‌, వాటర్‌ ట్యాప్స్‌ తదితర వస్తువులను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు లైజాల్‌ లేదా సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. సిబ్బందికి కరోనా లక్షణాలు గుర్తిస్తే, లేక నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌ వస్తే మొత్తం ప్రాంగణాన్ని డిస్‌ఇన్ఫెక్ట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. మొబైల్‌ ఫోన్స్‌, లాప్‌టాప్‌, కంప్యూటర్‌ కీబోర్డు, మౌస్‌ తదితరవాటిని ఎనిమిది గంటల్లో రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. పైన సూచించిన జాగ్రత్తలు అమలయ్యేలా చూసేందుకు కార్యాలయంలో కరోనా నిర్మూలన నోడల్‌ అధికారిని నియమించాలి. పేపర్లు, ఫైల్స్‌, నగదు వంటివి తాకిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకోవాలి.