Doctor’s Mistake: రెండో డోసులో వ్యాక్సిన్ మార్చేశారు.. వ్యక్తికి అస్వస్థత

Doctor’s Mistake: రెండో డోసులో వ్యాక్సిన్ మార్చేశారు.. వ్యక్తికి అస్వస్థత

World's Biggest Vaccine Producer Is Running Out Of Covid 19 Vaccines, As Second Wave Accelerates

Doctors Mistake: డాక్టర్లు చిన్న పొరపాటు చేసినా కూడా ప్రాణాల మీదకు వస్తుంది.. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం కూడా.. లేటెస్ట్‌గా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడంలో వైద్యుల పొరపాటు ఒకరిని అస్వస్థతకు గురిచేసింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన రైతు సంఘం నాయకుడు చిలుక విద్యాసాగర్‌రెడ్డి మార్చి 5న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

వాస్తవానికి కరోనా నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ రెండు వ్యాక్సిన్‌లను ఇస్తుండగా.. 45ఏళ్ల పైబడిన వారంతా తీసుకుంటున్నారు. మొదటి డోస్‌ ఏ టీకా తీసుకుంటే.. రెండో డోస్‌ అదే తీసుకోవాలి. కానీ, విద్యాసాగర్‌రెడ్డికి మాత్రం.. మొదటి డోస్‌ కోవిషీల్డ్, రెండో డోస్‌ కోవాగ్జిన్‌ ఇచ్చారు డాక్టర్లు. దీంతో విద్యాసాగర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

మొదటి డోస్ కోవిషీల్డ్‌ తీసుకోగా.. రెండో డోస్‌ ఏప్రిల్‌ 17న అదే ఆస్పత్రిలో కోవిషీల్డ్‌కు బదులుగా కోవాగ్జిన్‌ ఇచ్చారు. అప్పటినుంచి తల తిరగడం, నీరసంతో పడిపోవడం వంటి సమస్యలు వచ్చినట్లుగా బాధితుడు చెబుతున్నారు. కానీ డాక్టర్లు మాత్రం కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‍‌నే రెండోసారి కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

అయితే కంప్యూటర్‌లో డేటా ఎంటర్‌ చేసేప్పుడు పొరపాటు జరిగిందని, మొదటి డోస్‌ ఏ వ్యాక్సిన్‌ తీసుకుంటారో దానికి సంబంధించి రెండో డోస్‌ తీసుకునే సందర్భంలో అతని పేరు ఫీడ్‌ చేయగానే ఏ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.