Kaleshwaram: ప్రపంచం చూపు కాళేశ్వ‌రం వైపు.. 25న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం!

ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన ఎత్తిపోత‌ల ప‌థ‌కం కాళేశ్వ‌రం ప్రాజెక్టు. కాళేశ్వ‌రం విశిష్ట‌తను ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం చూడబోతుంది.

Kaleshwaram: ప్రపంచం చూపు కాళేశ్వ‌రం వైపు.. 25న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం!

Kaleshwaram

Kaleshwaram Documentary on Discovery: ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన ఎత్తిపోత‌ల ప‌థ‌కం కాళేశ్వ‌రం ప్రాజెక్టు. కాళేశ్వ‌రం విశిష్ట‌తను ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం చూడబోతుంది. భూగ‌ర్భంలో అద్భుత క‌ట్ట‌డం.. అతి పొడ‌వైన సొరంగాలు.. అతిపెద్ద బాహుబ‌లి మోటార్ల‌తో అత్యంత భారీగా రూపొందిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందింది డిస్కవరీ ఛానెల్. జూన్ 25వ తేదీన శుక్రవారం డిస్కవరీ ఛానల్‌‌లో ఈ ప్రోగ్రామ్ ప్రసారం కాబోతుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ప్రాజెక్టుపై ప్రఖ్యాత డిస్కవరీ ఛానెల్ డాక్యుమెంటరీ రూపొందించింది. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నదిలో నీరు పారే దిశకు వ్యతిరేక దిశలో వందల కిలోమీటర్ల చొప్పున నీటిని ఎత్తిపోసి పంట పొలాలకు నీరు అందిస్తుండగా.. ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలో మరెక్కడా లేని భారీ పంపులు, మోటార్లు, ఇంజనీర్లు, కార్మికుల శ్రమ, అన్నిటికీ మించి తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్టు సాకారానికి ప్రభుత్వం చేసిన కృషిని డాక్యుమెంటరీలో చూపెట్టనుంది.

ఇంగ్లీష్‌, హిందీ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది డిస్కవరీ ఛానెల్‌. ఈ విషయాన్ని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’ పేరిట గంటపాటు ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయనుంది డిస్కవరీ ఛానెల్. ఈ నెల 25న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. తెలంగాణ జీవనాడిగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కగా.. కాళేశ్వరం గొప్పదనం, నిర్మాణం, కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్, పంపింగ్ తదితర అంశాలపై ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు. 2017లోఈ ప్రాజెక్టును మొదలుపెట్టగా.. కేవలం మూడేళ్లలో పూర్తిచేయడాన్ని ప్రపంచానికి చూపెట్టబోతుంది డిస్కవరీ ఛానెల్‌.