టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

  • Published By: madhu ,Published On : August 6, 2020 / 06:08 AM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..2020, ఆగస్టు 06వ తేదీ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.



ఆయన మరణవార్త తెలుసుకున్న జిల్లా, నియోజకవర్గ ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈయన స్వస్థలం చిట్టాపూర్, ఆయన భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయ శ్రీలున్నరు. రాజకీయాల్లోకి రాకముందు..వివిధ వార్తా పత్రికల్లో పనిచేశారు. మెదక్. జహీరాబాద్, దుబ్బాక, సిద్ధిపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పనిచేశారు. జర్నలిస్టు నాయకుడిగా రాష్ట్రంలో జరిగిన పలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కొన్ని రోజుల పాటు పోలీసుల నిర్భందంలో కొనసాగారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.



2001 నుంచి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో కలిసి..తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2004లో మొదటిసారిగా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. 2009లో ఓటమి చెందారు.

2014, 2019లో ఎన్నికల్లో గెలుపొందారు. తొలి నుంచి ఆయన ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే విధంగా చేస్తూ వచ్చారు. ప్రజా నేతగా మారిన సోలిపేట రామలింగారెడ్డి మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దుబ్బాక ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రామలింగారెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.