దుబ్బాక దంగల్ లో గెలుపు ఎవరిది

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 07:12 AM IST
దుబ్బాక దంగల్ లో గెలుపు ఎవరిది

Dubbaka By Poll Results : తెలంగాణలో ఉత్కంఠ రేపుతోన్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. 2020, నవంబర్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలుకానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి దుబ్బాకలో గెలుపెవరిది? అధికారపార్టీ గెలుపు పవనాలు వీస్తాయా… లేక బీజేపీ ఎదురొడ్డి నిలుస్తుందా.. కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నిక బూస్ట్‌ ఇస్తుందా.



దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కోసం తెలంగాణ రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మూడు పార్టీల మధ్య జరిగిన పోరులో…. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అధికారపార్టీతోపాటు… కాంగ్రెస్‌, బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుకోసం మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు గెలుపు వ్యూహాలు రచించి అమలు చేశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నిక గెలుపుపై మూడు పార్టీలు ఆశలు పెంచుకున్నాయి. మరి దుబ్బాక ఓటరు ఎటువైపన్నది తేలనుంది.



ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటిగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి 30 నిమిషాలు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాతే కౌంటింగ్‌ ప్రారంభించనున్నారు.కలెక్టర్ భారతి హొళికేరి,రిటర్నింగ్ అధికారి చెన్నయ్య కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
దుబ్బాక కౌంటింగ్‌ కోసం 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్‌ నిబంధనల మేరకు కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.



అందుకే ఏడు టేబుల్స్‌ను ఒక దగ్గర, మరో ఏడు టేబుల్స్‌ను మరోచోట ఏర్పాటు చేస్తున్నారు. దుబ్బాక ఫలితం మొత్తం 23 రౌండ్లలో తేలిపోనుంది. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగటానికి 200 మంది సిబ్బందికి విధులు అప్పగించారు. సీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులలతో కౌంటింగ్‌ కేంద్రం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు… కౌంటింగ్‌ కేంద్రం దగ్గరికి వచ్చే వాహనాల కోసం పార్కింగ్‌ ప్రదేశం ఏర్పాటు చేశారు.



బారికేడ్లు, మీడియా గ్యాలరీ, ప్రజాప్రతినిధులు, అధికారుల రాకపోకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కౌంటింగ్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఐదుగురు కంటే మించి ఎక్కువ మంది గుమికూడవద్దని సీపీ జోయల్‌ డేవిస్‌ ప్రకటించారు. అంతేకాదు.. కౌంటింగ్‌ కేంద్రం నుంచి కిలోమీటర్‌ వరకు పార్టీ జెండాలు, పార్టీ గుర్తులు, ప్ల కార్డ్స్‌ ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేశారు. మైకులు, లౌడ్‌ స్పీకర్లు వాడొద్దని తెలిపారు. టెంట్లు, షామియానాలు వేయడానికి అనుమతి లేదు. బాణసంచా పేల్చడం, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషిద్ధని తెలిపారు.



కౌటింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమను విజయం వరిస్తుందా లేదా అన్న టెన్షన్‌ క్యాండిడేట్స్‌లో నెలకొంది. అయితే దుబ్బాక విజయంపై అన్ని పార్టీలు దీమాగా ఉన్నాయి. సర్వేలు మాత్రం టీఆర్‌ఎస్‌దే విజయమని చెబుతున్నాయి. ఒక సంస్థ మాత్రం బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది. సర్వే రిపోర్టులు ఏం చెబుతున్నా.. తుది ఫలితంపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ ఎత్తులు ఫలించాయి, ఏ పార్టీ ఎత్తులు చిత్తయ్యాయి అనేది తెలియాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే.