Raja Singh : రాజాసింగ్ పై ఈసీ సీరియస్.. కేసు నమోదు చేయాలని ఆదేశం

రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యూపీలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై బ్యాన్ విధించింది.

Raja Singh : రాజాసింగ్ పై ఈసీ సీరియస్.. కేసు నమోదు చేయాలని ఆదేశం

Raja Singh

Raja Singh : యూపీ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయ్యింది. రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యూపీలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై బ్యాన్ విధించింది. టీవీలకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఈ నెల 16న రాజాసింగ్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. అయితే, ఆ నోటీసులకు రాజాసింగ్ స్పందించలేదు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. యూపీ ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేయడంపై ఇప్పటికే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికీ రాజాసింగ్‌ నుంచి వివరణ రాకపోవడంతో ఈసీ సీరియస్‌ అయ్యింది. రాజా సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. 72 గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని రాజాసింగ్ పై నిషేధం విధించింది ఎన్నికల సంఘం.

‘ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తాం’ అంటూ రాజాసింగ్‌ వీడియో విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ”ఇప్పటికే యూపీలో వేల సంఖ్యలో జేసీబీలను, బుల్‌డోజర్లను యోగి తెప్పించారు. యోగికి ఎవరెవరు ఓటు వేయలేదో వారిని ఎన్నికల తర్వాత గుర్తిస్తాం. వారి ఇళ్లకు బుల్డోజర్లు పంపిస్తాం. జేసీబీ, బుల్డోజర్లు ఎందుకువస్తాయో తెలుసు కదా. యూపీలో ఉండాలని అనుకుంటున్నారా..? లేదా? యోగి అధికారంలోకి రాకపోతే మీరంతా యూపీని వదిలి పారిపోవాలి” అంటూ ఆ వీడియోలో హెచ్చరించారు రాజాసింగ్‌.

రాజాసింగ్ వ్యాఖ్యలపై సీరియస్‌ అయిన ఈసీ.. మరుసటి రోజే(ఫిబ్రవరి 16) నోటీసులు జారీచేసింది. గడువులోగా స్పందించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికీ రాజాసింగ్‌ స్పందించకపోవడంతో.. కేసు నమోదుకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది.