అగ్రిగోల్డ్ నిందితులకు 10 రోజులు ఈడీ కస్టడీ

అగ్రిగోల్డ్ నిందితులకు 10 రోజులు ఈడీ కస్టడీ

ED custody to Agrigold defendants for ten days : అగ్రిగోల్డ్ నిందితులను పది రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27 నుంచి జనవరి 5వరకు కస్టడీలో ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతించింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ప్రమోటర్లు ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఈడీ కోర్టు.

అంతకముందు 4వేల 109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలలో ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో ఏపీలోని 56 ఎకరాల హాయ్ ల్యాండ్ కూడా ఉంది. అంతేకాక.. పలు కంపెనీల్లోని వాటాలు, యంత్రాలను కూడా ఈడీ అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాక.. అగ్రిగోల్డ్‌పై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది.

అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారాలపై లోతైన దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు… అగ్రిగోల్డ్ గుట్టును బయటపెట్టారు. భారీగా విదేశాల్లో దాచిన అగ్రిగోల్డ్‌ సొమ్ము జాడ ఎట్టకేలకు బహిర్గతమైంది. సంస్థ యాజమాన్యం ఆ మొత్తాన్ని కరీబియన్‌ సముద్రంలోని కేమన్‌ దీవుల్లో దాచినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం విదేశాల్లో ఆర్థికపరమైన సేవలందించే పనామా సంస్థ మొసాక్‌ ఫొన్సెంకా సహకారం తీసుకున్నట్లు తేలింది.

కేమన్‌ దీవుల్లో డొల్ల కంపెనీలు సృష్టించి పెట్టుబడులను మళ్లించడం ద్వారా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఆకర్షణీయ పథకాలతో 7 రాష్ట్రాల్లో సుమారు 32 లక్షల మంది డిపాజిట్‌దారులను మభ్యపెట్టి దాదాపు 6 వేల 380 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ సంస్థ సేకరించింది.

ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ దర్యాప్తు చేయగా మనీలాండరింగ్‌ కోణం బహిర్గతం కావడంతో ప్రస్తుతం ఈడీ దృష్టి సారించింది. సంస్థ ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్లు వెంకట శేషు నారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ… హైదరాబాద్‌లోని ఈడీ పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచింది.

న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మరింత లోతుగా విచారించేందుకు నిందితులను కస్టడీకి అప్పగించాలని ఈడీ పిటీషన్‌ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ నిందితులను పది రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.