ఫిబ్రవరి 01 నుంచి కళాశాలలు, 50 శాతమే అనుమతి

ఫిబ్రవరి 01 నుంచి కళాశాలలు, 50 శాతమే అనుమతి

education-minister-sabitha-indra-reddy

education minister sabitha indra reddy : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 01వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా..స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు తాళాలు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా…తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాఠశాలలు, కాలేజీలను తెరవాలని భావించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

2021, జనవరి 29వ తేదీ శుక్రవారం విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కళాశాల తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణను ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని సూచించారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి…తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను తరచూ తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ కళాశాల తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

తరచూ తనిఖీలు చేయాలని, ప్రతినిత్యం శానిటైజేషన్ తప్పనిసరన్నారు. ప్రతి యూనివర్సిటీకి రూ. 20 లక్షలు తక్షణసాయంగా అందించాలని, కళాశాలలు పూర్తి సురక్షితం అన్న భావన కల్పించాలన్నారు. కళాశాలల్లో విద్యార్థులు గుమికూడకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.