Etala Rajender : నేను నోరు విప్పినందుకే పదవి పోయింది : ఈటల

నేను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే నా పదవి పోయిందనీ నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే నేను పదవిలో కొనసాగేవాడినని ఈటల రాజేందర్ అన్నారు. నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఈటల తెలిపారు.

Etala Rajender : నేను నోరు విప్పినందుకే పదవి పోయింది : ఈటల

Etala Rajender Criticisms

Etala Rajender Criticisms : టీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాక మాజీ మంత్రి ఈటల రాజేందర తరచూ గులాబీ పార్టీమీద తరచు విమర్శలు చేస్తునే ఉన్నారు. ఈక్రమంలో మరోసారి ఈటల మాట్లాడుతూ..నేను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే నా పదవి పోయిందనీ నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే నేను పదవిలో కొనసాగేవాడినని అన్నారు. నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని గతంలో జరిగిన కొన్ని ఘటనలను ఈటల ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసి ఉద్యమ పోరాటంలో నామీద ఎన్నో కేసులు పెట్టారని జైలుకు కూడా నేను వెళ్లి వచ్చానని కానీ నేడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నకొంతమంది నాయకులకు ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు. వారికి ఉద్యమం అంటే ఏంటో తెలీదని అన్నారు. కానీ వారికి పదవులు లభించాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని నేను జైలుకు వెళ్లి వచ్చాను. కానీ కరీంనగర్ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లి వచ్చాడా? ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అంటూ మంత్రి గంగుల కమలాకర్ ను ఉద్ధేశించి ఈటల విమర్శలు కురిపించారు.

నేను హుజారాబాద్ నియోజక వర్గం నుంచి గెలుపొంది ఆ నియోజక వర్గానికి ఎంతో అభివృద్ధి చేశాననీ..అందుకే హుజూరా బాద్ ప్రజలకు నేనంటే ఎంతో అభిమానమని..నాకు మద్ధతుగా వారు ఎప్పుడు ఉంటారని తెలిపారు. ఇప్పుడు నా మద్ధతుదారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. హుజారాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు వారి కోసం అవి చేస్తాం ఇవి చేస్తామని నమ్మిస్తున్నారని దీంట్లో భాగంగానే కులసంఘాల భవనాలు, పెన్షన్లు ఇచ్చి ఆకట్టుకుంటున్నారని ఈటల విమర్శించారు. ఇప్పటి వరకూ లేనివి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఓటు బ్యాంకు కోసమేనని అన్నారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుంటే హుజూరాబాద్ లో అస్సలు ఏమంత్రి అయినా అడుగుపెట్టేవారా? కానీ ఇప్పుడు మాత్రం ప్రజల్ని మభ్య పెట్టటానికి మంత్రులు హుజూరాబాద్ లో పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.