Etela Rajender : మీ కేసులకు భయపడేటంత చిన్నవాడు కాదు ఈటల….

భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో ఈటల సమావేశమయ్యారు. పథకం ప్రకారం తనపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రూ.వేల కోట్లు సంపాదించినట్టు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Etela Rajender : మీ కేసులకు భయపడేటంత చిన్నవాడు కాదు ఈటల….

Etela Rajender

Etela Rajender land grabing allegations : పథకం ప్రకారం.. తనపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. రూ.వేల కోట్లు సంపాదించినట్టు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మీ అరెస్టులు, కేసులకు భయపడే వ్యక్తిని కానన్నారు ఈటల రాజేందర్. నయూమ్ చంపుతానంటేనే నేను భయపడలేదన్నారు. మీ చర్యలకు భయపడతానా? అని ఈటల తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో ఈటల మీడియాతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాన్నారు. సీఎంగారితో 19ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నానని, పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ మచ్చ తెచ్చే పనిచేయలేదన్నారు. ఉద్యమ సమయంలో ప్రలోభాలు పెట్టినా లొంగలేదన్నారు.

అందరికంటే ముందే నాకు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కానీ, పార్టీ కానీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయలేదని ఈటల తెలిపారు. 2002లో టీఆర్ఎస్ లో చేరాను, పార్టీకి వచ్చే పనులు చేయలేదన్నారు. ఫారెస్ట్, విజిలెన్స్, రెవెన్యూ శాఖ అధికారులతో తనిఖీలు చేయించారని ఈటల చెప్పారు. నా ఫౌల్ట్రీ ఫామ్స్ ఉన్న ఏరియాల్లో తనిఖీల వల్ల కేసీఆర్ గారి గౌరవం పెరగదన్నారు. మీతో అడుగులు వేశాక మీతోనే ఉన్నాం.. వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా లేదన్నారు.

ఇవాళ రాజ్యం మీ చేతుల్లో ఉండొచ్చు.. అధికారులు, కలెక్టర్లు మీరు చెప్పింది చేయొచ్చు.. అసైన్డ్ భూములు కొలుస్తామని కనీసం మాకు నోటీసులు ఇచ్చారా? అని ఈటల ప్రశ్నించారు. మీరు అపారమైన అనుభవం ఉన్నవాళ్లు, ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అని అన్నారు. మీతో అడుగులో అడుగేశాకా.. సింగిల్ పైసా వ్యాపారం కూడా నేను చేయలేదన్నారు. అసైన్డ్ భూములు కొనుక్కున్నా, షెడ్లు వేసుకున్నా చర్యలకు అర్హుడనని చెప్పారు.

15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి సర్వే చేస్తారని తెలిపారు. మీ కేసులకు భయపడేటంత చిన్నవాడు కాదు ఈటల అని అన్నారు. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే ప్రజలు హర్షించరన్నారు. నోటీసులు ఇవ్వకుండా భూములను కొలిచారని మండిపడ్డారు. జమున హ్యాచరీస్ చైర్మన్ నేను కాదన్నారు. నివేదికలో నా పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు.

నా చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు.. సీఎంకు ఎదురు చెప్పే అవకాశం లేకపోవచ్చు.. కానీ చట్టం ఉంటుందన్నారు. నాకు నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుపై కోర్టుకు వెళ్తానని ఈటల స్పష్టం చేశారు. కోర్టు దోషిగా తేల్చితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.

మీ ఫార్మ్ హౌజ్ కోసం రోడ్డు వేయలేదా? మీకు ఎదురు చెప్పేవాళ్లు ఎవరూ లేరు, మీ అధికారులకు వావి వరుసలు లేవన్నారు. కానీ, రాజ్యాంగం అంటూ ఒకటి ఉంటుందన్నారు. చట్టాన్ని గౌరవించాలి కానీ, అతిక్రమించకూడదన్నారు. రోడ్డు కోసం అసైన్డ్ ల్యాండ్ పోతే.. మేమే భూములిస్తామని చెప్పామని తెలిపారు. 66 ఎకరాలు ఆక్రమించినట్టు ఎలా నివేదిక ఇస్తారని ప్రశ్నించారు. మీ ఏసీబీ, విజలెన్స్, కలెక్టర్, మీరు కోరుకున్నట్టే నివేదిక ఇస్తారని ఈటల విమర్శించారు. నా ఇంటి చుట్టూ పోలీసులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమేనన్నారు. కానీ, హుజూరాబాద్ ప్రజల అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం ఉంటుందన్నారు. నా సంపాదన, ఆస్తులపైనా నిజాయితీగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల కోరారు. మంత్రులుగా చూడకపోయినా పర్లేదు.. మనుషులుగా చూడండని హితవు పలికారు. చావునైనా భరిస్తా.. నా ఆత్మగౌరవాన్ని చంపుకోలేనని తెలిపారు.

మంత్రులుగా చూడకపోయినా పర్లేదు.. మనుషులుగా చూడండని హితవు పలికారు. చావునైనా భరిస్తా.. నా ఆత్మగౌరవాన్ని చంపుకోలేనని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవాలంటే బీఫామ్ ఒక్కటే సరిపోదన్నారు. పార్టీ బీఫామ్ ఇచ్చిన వారందరూ గెలవలేదని తెలిపారు. మీకు నాకు మధ్య ఉన్న అనుబంధం మీకు గుర్తు రావాలి కదా అని ఈటల పేర్కొన్నారు. అమ్ముడు పోకుండా కొట్లాడింది మీకు గుర్తుకు రావాలి కదా?అని ఈటల ప్రశ్నించారు. ఇదేం న్యాయం అని ఈటల సూటిగా ప్రశ్నించారు. నేను మీకు ఎందుకు దూరమయ్యానో మీ అంతరాత్మకు తెలుసునని ఈటల తెలిపారు.