Corona Vaccine : సూపర్ ఐడియా.. ఆ ఆఫీసులోకి అడుగు పెట్టాలంటే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే..

వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టడానికి కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల తహశీల్దార్ సువర్ణ వినూత్నంగా ఆలోచించారు. తాసిల్‌ కార్యాలయంలోనే ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆఫీసుకు వచ్చే వారందరికీ..

Corona Vaccine : సూపర్ ఐడియా.. ఆ ఆఫీసులోకి అడుగు పెట్టాలంటే, వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే..

Corona Vaccine

Corona Vaccine : సునామీలా విరుచుకుపడుతున్న కరోనావైరస్ మహహ్మరిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్. అవును.. డాక్టర్లు, ప్రభుత్వాలు.. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. దయచేసి ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ పెద్దఎత్తున టీకా కార్యక్రమం జరుగుతోంది. అయినప్పట్టికి ఇంకా చాలామంది ప్రజల్లో వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు, భయాలు, సందేహాలు ఉన్నాయి. దీంతో చాలామంది వ్యాక్సిన్ కు దూరంగా ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహ చాలామంది ఉంది.

ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టడానికి కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల తహశీల్దార్ సువర్ణ వినూత్నంగా ఆలోచించారు. తాసిల్‌ కార్యాలయంలోనే ఓ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆఫీసుకు వచ్చే వారందరికీ వ్యాక్సిన్‌ వేయిస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌, ఇతరత్రా అవసరాల కోసం ఆఫీసుకి వచ్చేవారు వెంట తెచ్చుకున్న ఆధార్‌కార్డు సాయంతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేయించి టీకా వేయిస్తున్నారు.

అందరూ టీకా తీసుకోవాలన్నదే లక్ష్యం:
”జుక్కల్‌ మండలం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. కర్నాకట, మహారాష్ట్రలో కరోనా సునామీలా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం జుక్కల్ ప్రాంతం వారికి ఆ రెండు రాష్ట్రాల రితో సంబంధాలు ఉన్నాయి. నిత్యం ఆ రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆఫీసుకి వచ్చే ప్రతి రైతూ టీకా తీసుకున్నారా లేదా అని ఆరా తీస్తున్నాం. లేదని తెలిస్తే అక్కడికక్కడే టీకా వేస్తున్నాం” అని జుక్కల్‌ తహశీల్దార్ సువర్ణ చెప్పారు.

తహశీల్దార్ చర్యను అధికారులు, స్థానికులు అభినందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అందరికీ టీకా ఇచ్చినట్టు అవుతుందన్నారు. కరోనా కట్టడికి ఇదో మంచి ప్రయత్నం అని అభిప్రాయపడ్డారు. మంచి పని చేస్తున్నారు అంటూ తహశీల్దార్ సువర్ణపై ప్రశంసలు కురిపించారు.