తెలంగాణలో యథాతథంగా పరీక్షలు.. షెడ్యూల్ ప్రకారమే!

తెలంగాణలో యథాతథంగా పరీక్షలు.. షెడ్యూల్ ప్రకారమే!

Osmania University

Exams in Telangana:తెలంగాణ రాష్ట్రంపై మరోమారు కరోనా పంజా విసురుతోంది. నెలరోజులుగా మహమ్మారిబారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోండగా.. తెలంగాణలో లాక్ డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ..? తప్పదని అంటున్నారు.. ఈ క్రమంలో అప్రమత్తమైన సర్కార్.. స్కూళ్లు కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలోని జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సంబంధిత వర్సిటీలు స్పష్టం చేశాయి.

తెలంగాణలో విద్యాసంస్థల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పరీక్షల నిర్వహణపై విశ్వవిద్యాలయాలు క్లారిటీ ఇచ్చాయి. పరీక్షలన్నీ యధావిధిగా కొనసాగుతాయని.. కరోనాతో రాయలేని వారికి ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ చెప్పారు. ప్రత్యేక పరీక్షను రెగ్యులర్‌గానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.

అలాగే కేయూ పరిధిలో జరగనున్న ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పరీక్షలు ఎప్పటిలాగానే జరగనున్నాయి. ఓయూ పరిధిలో ఇవాళ జరగబోయే పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు ఓయూ కంట్రోలర్‌ వెల్లడించారు. ఇప్పటికే పీజీ, ఇంజినీరింగ్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవ్వగా.. ఇవాళ నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కూడా మొదలుకానున్నాయి.

అయితే కోవిడ్-19 లక్షణాలు ఉంటే మాత్రం పరీక్షలకు అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. వారికి ప్రత్యేకంగా మరోసారి పరీక్షలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.