గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ..ఏ పార్టీకీ లభించని ఆధిక్యత

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 09:36 AM IST
గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ..ఏ పార్టీకీ లభించని ఆధిక్యత

GHMC mayor Excitement : గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ తొలగలేదు. ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో… జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనేదానిపై మరికొన్నాళ్లు స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 149 ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. నేరేడ్‌మెట్‌లో పోలైన ఓట్లలో స్వస్తిక్ గుర్తు వివాదాస్పదం కావడంతో ఫలితాన్ని హోల్డ్‌లో ఉంచింది. సోమవారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ డివిజన్‌లో టీఆర్ఎస్‌ ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ స్థానాన్ని కలుపుకుంటే…గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56డివిజన్లలో గెలుపొందినట్టు లెక్క. బీజేపీ, 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2చోట్ల విజయం సాధించాయి.



మేయర్ పదవి దక్కించుకోవడానికి ఏ పార్టీ అయినా రెండు పద్ధతుల్లో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా తమ సంఖ్యా బలాన్ని చూపించుకోవడం లేదంటే..ఎక్స్‌అఫీషియో సభ్యులను కలపడం. నేరుగా బలనిరూపణ చేసుకోవాలంటే..మొత్తం గ్రేటర్ డివిజన్లలోని 150 మందిలో సగం మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ 56 సీట్లు మాత్రమే ఖాతాలో వేసుకున్న టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు నేరుగా బలం నిరూపించుకునే అవకాశం లేదు. మ్యాజిక్ ఫిగర్ అయిన 76కు చేరుకోవడానికి ఇంకా ఇరవై సీట్ల దూరంలో ఉంది. గ్రేటర్‌లో 48 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్‌ 100 అవుతుంది.



56 మంది కార్పొరేటర్లతో పాటు టీఆర్‌ఎస్‌కు 34 మంది సభ్యుల ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. అలాగే..ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికల్లో ఓటు వేయకుండా…గ్రేటర్‌లో ఓటు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మేయర్ ఎన్నికలో ఓటు వేయవచ్చు. ఈ విధానంలో కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్సీల ఓట్లు టీఆర్‌ఎస్‌కు కలుస్తాయి. అయినప్పటికీ…టీఆర్‌ఎస్‌కు మేయర్ పదవి సాధించేందుకు సరిపడా బలం లేదు. అయితే 44 స్థానాలు గెలుపొందిన మజ్లిస్ మద్దతు తెలిపితే..టీఆర్ఎస్‌కు ఎక్స్ అఫీషియో సభ్యుల అవసరం లేకుండానే మేయర్ పీఠం దక్కుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌..మజ్లిస్‌ మద్దతు తీసుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.



నేరుగా ఎంఐఎం మద్దతు తీసుకోకపోయినా.. మరో విధానంలో మేయర్ పదవి దక్కించుకునే అవకాశం టీఆర్‌ఎస్‌కు ఉంది. కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రోజు…హాజరయిన సభ్యుల్లో మెజార్టీ ఉన్న పార్టీ అభ్యర్ధిని మేయర్‌గా ఎన్నుకుంటారు. టీఆర్ఎస్..ప్రత్యక్షంగా ఎంఐఎం మద్దతు తీసుకోకపోయినా…ఎన్నిక రోజు…వ్యూహం ప్రకారం మజ్లిస్ సభ్యులు హాజరుకాకపోతే…మేయర్ పదవి సహజంగా అధికార పార్టీకి దక్కుతుంది. ఎన్నికరోజు ఒకవేళ 150మంది హాజరైతే.. 76 మంది మద్దతును టీఆర్ఎస్ చూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంఐఎం సభ్యులు గైర్హైజరైతే.. 106మంది సభ్యుల కోరం మాత్రమే ఉంటుంది.



అందులో సగం అంటే 54మంది సభ్యుల బలం కావాలి. టీఆర్ఎస్‌కు 56 మంది సభ్యుల బలం ఉంది కాబటి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను ఈజీగా కైవసం చేసుకుంటుంది. అలా కాకుండా ఎంఐఎం కోరంకు హాజరైతే.. మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో తమ అభ్యర్థులను నిలపాల్సి ఉంటుంది. 56మంది మద్దతు టీఆర్ఎస్‌కు ఉంటుంది. ఎంఐఎంకు 44మంది మద్దతు మాత్రమే ఉంటుంది. ఆటోమెటిక్‌గా ఎక్కువ మంది సభ్యుల బలమున్న టీఆర్ఎస్ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్‌ గా ఎన్నికవుతారు. ఈ వ్యూహాన్ని గులాబీ దళం అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వరకు ఉంది. ఎన్నికలు ముగిసినప్పటికీ..పాలకమండలిని రద్దుచేసే ఆలోచనలో లేదు రాష్ట్ర ప్రభుత్వం. టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో….మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను వీలైనంత ఎక్కువ సమయం తీసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. మేయర్ పదవి దక్కించుకునేలా తగిన వ్యూహం సిద్ధం చేసుకునేందుకు…పాలకమండలి పదవీకాలాన్ని పూర్తికాలం కొనసాగించాలన్నది టీఆర్‌ఎస్‌ ఆలోచన.