కేసీఆర్ ఏం చెబుతారు ? ఎవరిని టార్గెట్ చేస్తారు ?

  • Published By: madhu ,Published On : November 28, 2020 / 06:52 AM IST
కేసీఆర్ ఏం చెబుతారు ? ఎవరిని టార్గెట్ చేస్తారు ?

Excitement over KCR speech : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు మినీ సంగ్రామంగా మారాయి. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా గ్రేటర్‌లో తిరిగి జెండా పాతాలని వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా.. రాష్ట్రస్థాయి నేతలు అన్ని డివిజన్లలో ప్రచారంలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ రోడ్ షోలు, సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే.. ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ టిఆర్ఎస్‌కు కీలకంగా మారనుందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.



బహిరంగ సభ కోసం జనాల సమీకరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు. కేసీఆర్ సభను సూపర్ సక్సెస్ చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. హైదరాబాదీ జనం టీఆర్ఎస్ వెంటే ఉన్నారనే సంకేతాలను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ ఎవరిని టార్గెట్ చేస్తారు.. ఏం చెబుతారు అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. గ్రేటర్‌లో గెలిచేది టీఆర్ఎస్సే అని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు. సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌కు పట్టం కడతాయని కేసీఆర్ ధీమాగా ఉన్నారు.



https://10tv.in/ghmc-elections-trs-public-meeting-in-lb-stadium/
అయితే… డెవలప్‌మెంట్‌ విషయంలో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చేసిన పనులన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే జరిగాయంటూ బీజేపీ ఊదరగొడుతోంది. మరోవైపు.. ఎంఐఎం ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ కామెంట్లు చేస్తుంది..ప్రతీ అంశంపైనా ఎల్బీ స్టేడియం వేదికగా కేసీఆర్ గట్టి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. మత విద్వేషాలతో అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారికి ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం కేసీఆర్ ఘాటైన హెచ్చరిక చేస్తారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. హైదరాబాద్‌ను శాంతియుత విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మరోసారి వెల్లడించనున్నారు.



ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ, గ్రేటర్ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచిన అంశాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు మరింత అండగా ఉండేందుకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించే విషయాన్ని, ఎంబీసీలకు ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఈ విషయాన్ని కూడా ఈ వేదికగా మరోసారి గుర్తు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్నికలకు కొన్ని గంటల ముందు అధినేత భారీ బహిరంగ సభ ద్వారా ప్రచారం చేయడం తమకు కలిసొస్తుందనే అభిప్రాయం అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించినా… ఇన్నాళ్లొక లెక్క.. ఇకపై మరో లెక్క అనే రేంజ్‍‌లో ఉంటుందంటున్నారు.