సిబ్బందికి జీతాలిచ్చేందుకు ఇబ్బందులు, GHMC స్టాడింగ్ కమిటీ సభ్యులకు ఖరీదైన iPhones

సిబ్బందికి జీతాలిచ్చేందుకు ఇబ్బందులు, GHMC స్టాడింగ్ కమిటీ సభ్యులకు ఖరీదైన iPhones

GHMC Standing Committee members : GHMCలో ఐఫోన్ల (iPhones) వ్యవహారం కలకలం రేపుతోంది. మరో 15 రోజుల్లో బల్దియా పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో పనిలో పనిగా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐఫోన్ల కోసం పట్టుబట్టినట్లు తెలుస్తోంది. iphone 12 pro 512 GB కలిగిన 20 మొబైల్స్‌ను కొనుగోలు చేయాలని స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసినట్లు సమాచారం. ఒక్కో iphone ‌ విలువ లక్షా 20 వేలుగా ఉంది. మొత్తం 20 ఫోన్లకి 24 లక్షల రూపాయలు బల్దియా ఖర్చు చేయనుంది.

సిబ్బందికి నెలనెలా జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న బల్దియా… బడ్జెట్ నుంచి లక్షల రూపాయల ఖర్చు చేయాలని నిర్ణయించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిధుల కొరతతో 45 రోజులుగా ఆలస్యంగా కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు GHMC వేతనాలు చెల్లిస్తోంది. ప్రజల వద్ద నుంచి పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తోన్న అధికారులు ఇంత విలాసవంతమైన ఫోన్ల కొనుగోలుకు ప్రతిపాదనలు రూపొందించడంపై మండిపడుతున్నారు. ఆగస్టు నుంచి ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా… అధికారులే ఈ ప్రతిపాదనలు రూపొందించడం చర్చనీయాంశంగా మారింది.

బల్దియా బండెడు కష్టాల్లో ఉందా.. ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించడమే భారంగా మారిందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జీతాలే కాదు.. బిల్లుల చెల్లింపులు కూడా కష్టంగా మారింది. దీంతో… ముందున్న కొత్త ప్రాజెక్టుల పరిస్థితిపై డైలమా నెలకొంది. ఒక‌ప్పుడు కాసుల‌తో గ‌లగ‌ల‌లాడిన జీహెచ్ఎంసీ ఖజనా.. ఇప్పుడు వెలవెలబోతోంది. వరదలు, వర్షాల కారణంగా బల్దియా సిబ్బంది ఇతర పనులపై ఫోకస్ పెట్టడంతో… కార్పొరేషన్‍‌కు ఆదాయం తగ్గిపోయింది. పిక్స్‌డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. పన్నుల వసూళ్లు మందగించాయి. కొత్త ప్రాజెక్టులు భారంగా మారిపోతున్నాయి. ఇన్ని సమస్యల మధ్య.. సిబ్బంది జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిపోయింది. ఒకటో తారీఖు వస్తోందంటేనే… ఉద్యోగుల్లో, అధికారుల్లో ఆందోళన మొదలవుతోంది.