అదిరిపోయే ఆఫర్ అంటారు, రూ.90లక్షలు ఇస్తే కోటి రూపాయలు ఇస్తామంటారు.. కట్ చేస్తే…

  • Published By: naveen ,Published On : September 23, 2020 / 11:31 AM IST
అదిరిపోయే ఆఫర్ అంటారు, రూ.90లక్షలు ఇస్తే కోటి రూపాయలు ఇస్తామంటారు.. కట్ చేస్తే…

కష్టపడకూడదని అనుకున్నారు. చెమటోడ్చకుండా ఈజీగా మనీ సంపాదించాలనుకున్నారు. తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాలనుకున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదన కోసం ఆ డబ్బునే అడ్డం పెట్టుకున్నారు. అందుకు ఓ పథకం వేశారు. ప్లాన్‌ సక్సెస్‌ అయినట్లే అనుకుంటున్న సమయంలో….ఆ ముఠాకు ఊహించని షాక్‌ ఎదురైంది. అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన పోలీసులతో బాగోతం బట్టబయలైంది.

90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే, కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామంటారు:
మొత్తం ఐదుగురు వ్యక్తులు.. 500 నోట్లు ఇస్తే..2 వేల నోట్లు ఇస్తామంటారు.. అందులో 10 లక్షల ఆఫర్ కూడా ఉంటుంది.. అంటే మీరు 90 లక్షల విలువ గల 500 రూపాయల నోట్లు ఇచ్చారనుకోండి.. వారు కోటి విలువ గల 2 వేల రూపాయల నోట్లు ఇస్తారన్నమాట. అంటే మీకు పది లక్షలు లాభం. ఇదీ ఆ గ్యాంగ్ చేసే మోసం. వారు ఓ వీడియో చూపిస్తారు. అందులో చాలా అట్టపెట్టెలు ఉంటాయి. అందులో నోట్ల కట్టలు కనిపిస్తాయి. అన్నీ రూ.2వేల నోట్లే. ఆ డబ్బు విలువ అక్షరాల రూ.200 కోట్లు.



మన దగ్గర అసలు నోట్లు తీసుకుంటారు, వాళ్ల దగ్గరున్న నకిలీ నోట్లు ఇస్తారు:
వాళ్ల దగ్గర డబ్బుంది..వాళ్లకి 500 నోట్లు కావాలి..కోటి రూపాయలకు 10 లక్షల ఆఫర్..ఇదేదో బాగుందని 500 నోట్లు ఇవ్వడానికి మీరు రెడీ అయిపోయారా..? బీరువా, బ్యాంకు లాకర్లు సదిరేస్తున్నారా…? అప్పు చేసైనా సరే ఇవ్వాలని అనిపిస్తుందా…? ఒక్క సెకన్ ఆగండి. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. కళ్లకు కనిపించేది.. చెవులకు వినపడేవి అన్నీ నిజాలు కాదు. ఆ ఐదుగురు వ్యక్తులు నిజమే..వాళ్ల ప్రపోజల్ నిజమే..వాళ్లు చూపించిన వీడియోలో డబ్బూ నిజమే..కానీ అక్కడే ఉంది తిరకాసు. వీళ్లంతా నకిలీగాళ్లు. అంటే నకిలీ నోట్ల ముఠా అన్న మాట..వీళ్ల వద్ద ఉన్నది కూడా నకిలీ డబ్బు. అంటే మీ నుంచి అసలైన 500 నోట్లు తీసుకుని…మీ చేతిలో నకిలీ 2 వేలు నోట్లు పెట్టి కంటికి కన్పించకుండా మాయమైపోతారు. ఇదే వీళ్ల దందా.



పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టు:
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన నాగప్రసాద్‌ను ఈ ముఠా టార్గెట్‌ చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2 వేల నోట్లను రద్దు చేస్తుందని…,అందుకే 500 నోట్లు 90 లక్షలు ఇస్తే కోటి రూపాయలు విలువైన 2 వేల రూపాయల నోట్లు ఇస్తామని చెప్పుకొచ్చింది. దీనిపై అనుమానం వచ్చిన నాగప్రసాద్‌…ముఠాకు ఊహించని షాక్‌ ఇచ్చాడు. మీరు చెప్పినట్లే చేస్తానని నమ్మబలికి..మెల్లిగా పోలీస్ స్టేషన్‌కు చేరాడు. అక్కడ ఈ ముఠా డీల్ గురించి చెప్పేశాడు. పోలీసులకు సీన్ అర్థమైంది. కేటుగాళ్లను ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తితో పాటు మఫ్తీలో వెళ్లారు పోలీసులు. అక్కడ నకిలీగాళ్లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కటకటాల వెనక్కి నెట్టారు.



డబ్బు ఆశతో పోతే బుక్కయిపోతారు:
దేశంలో నోట్ల మార్పిడి జరిగినప్పటి నుంచి..ఏ నోటు ఎప్పుడు ఉంటుందో..ఎప్పుడు పోతుందో..తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. ఇప్పటికే 2 వేల నోట్లపై కొందరికి అనుమానాలు ఉన్నాయి. అలాంటి వాళ్లకు నోట్లు మార్చేందుకు వచ్చారు ఈ నకిలీగాళ్లు. సో..డబ్బు ఆశతో..అలాగే రద్దు అవుతాయనే భయంతో…ఇలాంటి ముఠాల చేతికి చిక్కి మోసపోకండి.

ఈ కేసులో సర్పవరం పోలీసులు విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన బమిడిపాటి వెంకట సుధాకర్, విశాఖ పెద్దజాలరి పేటకు చెందిన తాటికాయల రాజా రవి శేఖర్, మల్కపురకు చెందిన కామక నర్సింగ రావ్, కోడి కొండబాబు, కాకినాడ కర్నన్ గిరి జంక్షన్ కి చెందిన సూర్య సుబ్రమశర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.