యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్

యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్

Fake Doctor Conducts Illegal Operations In Warangal

Fake Doctor In Warangal :  తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో మరో ఫేక్ డాక్టర్ గుట్టును వైద్యశాఖ అధికారులు రట్టు చేశారు. ఈ డాక్టర్ ఏకంగా యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్ చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. బీఎస్సీ చదివి మెడికల్ రిప్రజెంటివ్ గా పనిచేసిన ఆండ్రు ఇంద్రారెడ్డి అనే వ్యక్తి ఎంబీబీ ఎస్ చదివినట్లుగా కలర్ ఇచ్చాడు.

ఆర్ ఎంపీ, పీఎంపీల సహాయంతో ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తాడు. యూట్యూబ్ చూసి ఆపరేషన్లు చేసేస్తున్నాడు. అలాగే గర్భిణులకు అబ్బార్షన్లు కూడా చేసేస్తున్నాడు. ఈ ఫేక్ డాక్టర్ గుట్టును బైటపెట్టిన అధికారులు ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేయటానికి వెళ్లగా గోడదూకి పారిపోయాడు. దీంతో అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఇంద్రారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.

యూట్యూబ్‌ చూసి వంటలు నేర్చుకోవడం, ఇతర క్లాసులు వినడం సహా అనేక అంశాలు నేర్చుకుంటాం. కానీ బీఎస్సీ చదివిన ఇంద్రారెడ్డి మాత్రం ఏకంగా డాక్టర్ అయిపోయాడు. యూట్యూబ్ చూస్తూ అబార్షన్ చేస్తూ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ రూరల్ జిల్లా చెంగారావు పేటకు చెందిన ఇంద్రారెడ్డి గత నెలలో హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పటిల్ పేరుతో ఓ ఆస్పత్రిని ప్రారంభించాడు. పిల్లలు వద్దనుకునే వారికి, ఇతర సమస్యలు ఉన్న మహిళలకు అబార్షన్లు చేస్తున్నాడు. గ్రామంలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా బాధితులను గుర్తించి వారికి కమిషన్లు ఇచ్చి పేషెంట్లను తీసుకువచ్చేవాడు. ఇక నర్సింగ్‌లో శిక్షణ పొందిన వారిన సహాయంతో యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు.

ఇంద్రారెడ్డి ట్రీట్‌మెంట్‌పై అనుమానం రావడంతో వైద్యశాఖ అధికారులకు కొంతమంది సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఇంద్రారెడ్డి అబార్షన్ చేస్తున్నాడు. అధికారులను చూసిన ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా గోడ దూకి పారిపోయాడు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న మహిళన బాత్రూమ్‌లో దాచారు.

మహిళకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. ఇంద్రారెడ్డి మూడేళ్ల క్రితం వరంగల్ రూరల్ జిల్లా నర్సాపేట్‌లోనూ ఓ ఆస్పత్రి ఏర్పాటు చేయగా అక్కడ ఇలాగే బుక్ అయ్యాడు. అప్పుడే ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేసి అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. అయినా మళ్లీ ఇప్పుడు హన్మకొండలో మరో ఆస్పత్రి పెట్టి మరోసారి ఈ ఫేక్ డాక్టర్ దొరికిపోయాడు.