EPF Subscribers : కరోనా కల్లోలంలో భవిష్యనిధి అండ..చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 7 లక్షల బీమా చెల్లింపు

కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతన జీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్యనిధి పథకం (ప్రావిడెంట్ ఫండ్) అండగా నిలవనుంది.

EPF Subscribers : కరోనా కల్లోలంలో భవిష్యనిధి అండ..చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 7 లక్షల బీమా చెల్లింపు

EPF subscribers

EPF subscribers families of deceased Rs. 7 lakh insurance : కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతన జీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్యనిధి పథకం (ప్రావిడెంట్ ఫండ్) అండగా నిలవనుంది. ప్రైవేటు సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న ఎంతోమంది వేతన జీవులు కరోనా బారిన పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరి లక్షల రూపాయలు ఖర్చుచేసి అప్పుల పాలవుతున్నారు. కొందరికి చికిత్స చేయించినా ఆరోగ్యం విషమించడంతో కన్నుమూస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించినా లాభం లేకపోవడంతో అటు కుటుంబ పెద్దను కోల్పోయి, ఇటు అప్పుల పాలై ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి.

ఆదుకుంటోన్న ఈడీఎల్ఐ
అలాంటి కుటుంబాలను ఈపీఎఫ్ వో (ఉద్యోగుల భవిష్యనిధి) పరిధిలోని ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం-1976 (ఈడీఎల్ఐ) ఆదుకుంటోంది. ఈ పథకం కింద భవిష్యనిధిలో చందాదారుల కుటుంబాలు రూ. 7 లక్షల వరకు గరిష్ఠ బీమా సహాయాన్ని పొందవచ్చు. గతంలో ఈ పరిహారం రూ. 6 లక్షల వరకే ఉండేది. దానిని రూ. 7 లక్షలకు పెంచుతూ ఈపీఎఫ్ వో ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పరిహారం, సవరించిన నిబంధనలు గత ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని, ఈ నిబంధనలు మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది.

సహజ మరణమైనా పరిహారం
ఈపీఎఫ్ వోలో చందాదారుగా ఉండి చనిపోయిన వేతన జీవులు ఈ పథకం కింద అర్హులు. వారు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణాలైనా కూడా ఈ బీమా పథకం కింద పరిహారం లభిస్తుంది. ముఖ్యంగా కరోనా సమయంలో చాలామంది వేతన జీవులు ఆ మహమ్మారి బారినపడి కన్నుమూస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు పీఎఫ్ సంస్థ నిబంధనల్లో కొన్ని సవరణలు చేశారు.

ఏడాదిగా సర్వీసులో ఉంటే బీమా పరిహారం
గతంలో ఈడీఎల్ఐ కింద పరిహారం పొందేందుకు చందాదారు చనిపోయిన నాటికి ఏడాది కాలంగా ఒకే కంపెనీలో పనిచేస్తూ ఈపీఎఫ్ చందాదారుగా ఉండాలనే నిబంధన ఉండేది. అయితే ఇటీవల మెరుగైన అవకాశాల కోసం చాలామంది తరచూ సంస్థలు లేదా కంపెనీలు మారుతున్నారు. అలాంటివారు పాత నిబంధన కారణంగా ఈడీఎల్ఐ కింద పరిహారం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కంపెనీ అనే పదాన్ని తొలగిస్తూ ఏడాదిగా సర్వీసులో ఉంటే బీమా పరిహారం కింద అర్హులని భవిష్యనిధి సంస్థ సౌలభ్యం కల్పించింది.

కనీసం రూ. 2.5 లక్షలు
ఈడీఎల్ఐ కింద అర్హత కలిగిన వేతన జీవుల కుటుంబానికి కనీస బీమా పరిహారం కింద రూ. 2.5 లక్షలు చెల్లిస్తారు. పరిహారం అంతకు తగ్గడానికి వీల్లేదు. గరిష్ఠ పరిహారం గతంలో రూ. 6 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.7 లక్షలు చేశారు. గరిష్ఠ బీమా పరిహారం చెల్లించేందుకు ఏడాది సగటు ఈపీఎఫ్ వేతనాన్ని 30 రెట్లు లెక్కించి ఇచ్చేవారు. తాజాగా లెక్కింపు మొత్తాన్ని 35 రెట్లకు పెంచారు. అంటే ఉద్యోగి అర్హత మేరకు బీమా పరిహారం చెల్లింపు ఉంటుంది.

దరఖాస్తు ఎలా…?
మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఫారం – 5ఐఎఫ్ సమర్పించాలి. సాధారణంగా ఉద్యోగి మరణించినపుడు క్లెయిమ్ దరఖాస్తులు ఆయా సంస్థలు సమర్పిస్తాయి. అదే సమయంలో ఫారం 10సీ, డీ, ఫారం-5ఐఎఫ్ కలిపి ఒకేసారి సమర్పిస్తే మూడు రోజుల్లో పీఎఫ్ అధికారులు ఆ దరఖాస్తులు పరిష్కరించి బీమా సొమ్ముతో పాటు నగదు నిల్వలు, పింఛను మంజూరు చేస్తున్నారు. క్లెయిమ్ పరిష్కార సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారులు ఉద్యోగి చనిపోయిన తేదీ నాటికి ఆయా సంస్థల మస్టర్ రోల్ లో ఉన్నారా లేదా నిర్ధారించుకుని పరిహారం అందిస్తున్నారు.