ధర్మారెడ్డి సూసైడ్ పై కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు..భూమి అమ్మాలంటూ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి

  • Published By: bheemraj ,Published On : November 9, 2020 / 09:00 PM IST
ధర్మారెడ్డి సూసైడ్ పై కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు..భూమి అమ్మాలంటూ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి

Dharmareddy suicide : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మారెడ్డి సూసైడ్ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు.



97 ఎకరాల భూ వివాదంలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ధర్మారెడ్డి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భూమి అమ్మాలంటూ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని ఆరోపించారు. తమ భూమిని కాజేసేందుకు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



కుట్రపూరితంగానే తమకు ఈ కేసులో ఇరికించారని చెప్పారు. తమ వారసత్వ భూమిని కేఎల్ఆర్ కాజేయాలని చూశారని పేర్కొన్నారు. 97 ఎకరాల్లో పలు కంపెనీలను కేఎల్ఆర్ పేరుతో ఏర్పాటు చేశారని చెప్పారు. 97 ఎకరాల భూ వివాదంలో రాజకీయ నేతల ప్రమేయంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు. నాగరాజు కేసును ఆసరాగా చేసుకొని తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.



రికార్డుల్లో భూమిపై తమ కుటుంబానికి సర్వ హక్కు ఉందన్నారు. ఇందులో భాగంగానే తహసీల్దార్ నాగరాజు 24 ఎకరాల భూమిని తమ పేరిట మ్యుటేషన్ చేశారని పేర్కొన్నారు. మిగతా భూమిని కూడా తమకు ఎక్కడ మ్యుటేషన్ చేస్తారోనని తమపై కక్ష కట్టటారని చెప్పారు. దీని వెనుక కేఎల్ఆర్ తోపాటు మరికొంత మంది ప్రమేయం ఉందన్నారు. భూములపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని ధర్మారెడ్డి కుటుంబం సభ్యులు కోరారు.

కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్ పై విడుదలైన ధర్మారెడ్డి.. కుషాయిగూడ వాసవి శివనగర్ లోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మ్యుటేషన్ ఆరోణతో ఏసీబీ అతన్ని అరెస్టు చేయగా 33 రోజులపాటు జైలు జీవితం గడిపారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్టైన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నారు.

కోటి రూపాయల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుసగా ఆత్మహత్యకు చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది.