చేతిలో పురుగుల మందు బాటిల్, ఊరి దారికి అడ్డంగా మంచం.. లంచాలు ఇచ్చుకోలేక ఓ రైతు నిరసన

  • Published By: naveen ,Published On : September 29, 2020 / 12:31 PM IST
చేతిలో పురుగుల మందు బాటిల్, ఊరి దారికి అడ్డంగా మంచం.. లంచాలు ఇచ్చుకోలేక ఓ రైతు నిరసన

farmer protest: రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. కరప్షన్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే.. రెవెన్యూ అధికారుల తీరుమాత్రం మారడం లేదు. లంచాల కోసం రైతులను పీడిస్తూనే ఉన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ రైతు.. రెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసనకు దిగాడు. రఘుపతి అనే రైతు.. ఊరు దారికి అడ్డంగా మంచం వేసుకుని పడుకున్నాడు. పురుగుల మందు బాటిల్‌ చేతపట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసనకు దిగాడు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక గ్రామానికి చెందిన రైతు రఘుపతికి 5 ఎకరాల సొంత పొలం ఉంది. తన భూమికి పట్టాపాస్‌ బుక్‌ కోసం ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఏ అధికారి ఆయన మొరను పట్టించుకోలేదు. స్థానిక నేతలను సంప్రదించినా వారు పట్టించుకోలేదు. తన భూమికి పాస్‌బుక్‌ ఇవ్వాలని స్థానిక తహసీల్దార్‌, ఇతర రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. లంచం ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో ఆవేదన చెందాడు.



అధికారుల తీరుతో విసిగిపోయిన రఘుపతి తన గ్రామంలోనే నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేశాడు. అక్కడే మంచం వేసుకుని.. దానిపై పురుగు మందు డబ్బా పెట్టుకుని నిరసన తెలిపాడు. తన సమస్యను పరిష్కరించకుంటే చనిపోతానని హెచ్చరిస్తున్నాడు.