కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలి: సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలి: సీఎం కేసీఆర్

CM Kcr: రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. చాలా దేశాలు రైతుల కోసం భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయన్నారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం రైతులకు సబ్సిడీ ఇస్తామన్నా.. ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు.

రైతులు పండించిన వరి ధాన్యానికి ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని భావిస్తే… ఎఫ్‌సీఐ 1,888 రూపాయలకు మించి కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా రైతులు సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతులు అందులో ముందు వరుసలో ఉండాలన్నారు. రైతుల శక్తి ఏంటో కేంద్రానికి తెలియజేయాలన్నారు. రైతులు సంఘటితం అయితేనే వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.



విడివిడిగా ఉంటే ఏం సాధించలేరని.. రైతులంతా ఏకమైతే తెలంగాణలో రైతు రాజ్యం వస్తుందన్నారు. రైతులు సంఘటితం కావడం కోసమే రైతు వేదికలు నిర్మించామన్నారు. రైతు వేదికలు ఒక ఆటంబాబు అని అభివర్ణించారు. రైతులంతా ఒక్కటైతే దాని శక్తే వేరని చెప్పారు.

సీఎం కేసీఆర్.. రైతు సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 604 రైతు వేదికలు నిర్మించామన్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణం కోసం రూ. 22 లక్షల ఖర్చు అయింది. ఆధునిక సౌకర్యాలతో రైతు వేదికల ఏర్పాటు చేశాం. ఇప్పటికే 90 శాతానికి పైగా వేదికల నిర్మాణం పూర్తైంది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై సలహాలిస్తారు. రైతు వేదికల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పిస్తాం. రైతు బంధు సమితులను కీలకం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతుబంధు సమితి కార్యక్రమాలు ముమ్మరం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.

వ్యవసాయం, రైతులకు సంబంధించిన సమస్యలు గురించి చర్చిస్తారు. ఈ వేదికల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. నియంత్రిత పంటల సాగువిధానం అమలుపై చర్చ జరుపుతాం.

రైతులు సంఘటితం అయితే గొప్ప విప్లవానికి నాంది పలుతాయన్నారు కేసీఆర్‌. రైతుల కోసం తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నామని.. అందులో భాగమే రైతు వేదికల నిర్మాణమన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబాలు ఆగం కావొద్దని రైతు బీమా తీసుకొచ్చామన్నారు.