రైతు సంక్షేమం పేరుతో వేల కోట్లు దోపిడీ : మాంటెక్ సింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : January 29, 2019 / 03:26 AM IST
రైతు సంక్షేమం పేరుతో వేల కోట్లు దోపిడీ : మాంటెక్ సింగ్

రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతున్నప్పటికీ దేశంలో రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం(జనవరి 28,2019) హైదరాబాద్ లో అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిధిగా అహ్లువాలియా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రైతుల స్థితిగతులపై ఆయన మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ అజెండాలే తప్ప రైతులకు మేలు చేసే నిర్ణయాలు జరగడం లేదన్నారు.

యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వంలో  అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రైతుల సబ్సిడీ పేరుతో నిధుల దోపిడీ జరుగుతోందని, దీన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు బీమా, వివిధ రాయితీలు, సబ్సీడీలతో వ్యవసాయ రంగం దుర్భిక్షం నుంచి బయటపడే అవకాశాలు లేవన్నారు. యూరియా సబ్సిడీ, విత్తన సబ్సిడీ లాంటి వివిధ రకాల పథకాల పేరుతో ఏటా వేల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. రైతుకు ప్రభుత్వపరంగా అందించే సాయం కేవలం నగదు రూపంలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక కార్యక్రమాలు కాకుండా రైతుల తక్షణ అవసరాలు తీర్చే పథకాలు అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని, జాతీయ స్థాయిలో రైతు సంఘాలు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన అవసరముందని తెలిపారు.