హైదరాబాద్‌లో Fiat క్రిస్లర్ పెట్టుబడులు

హైదరాబాద్‌లో Fiat క్రిస్లర్ పెట్టుబడులు

Fiat Chrysler : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టగా.. వాటి సరసన ఫియట్‌ క్రిస్లర్‌ సంస్థ కూడా చేరనుంది. మేటి జీప్‌ కార్లకు సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోమొబైల్‌ సంస్థ ఫియట్‌ క్రిస్లర్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఫియట్ ప్రకటించింది. ఫియట్ సంస్థ 15 కోట్ల డాలర్ల పెట్టుబడులు అంటే సుమారు 1100 కోట్లతో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పాలన.. టీఎస్ ఐపాస్ విధాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. ఫియట్ సంస్థ ఏర్పాటు చేసే గ్లోబల్ డిజిటల్ హబ్‌తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భవిష్యత్‌కు కావాల్సిన ఆటో మొబైల్‌ రంగానికి హైదరాబాద్‌ కేంద్రం కానున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

ఇటలీకి చెందిన ఫియట్‌.. ఉత్తర అమెరికా తర్వాత భారీ డిజిటల్‌ హబ్‌ ఇదే తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది ఆఖరు నాటికి వెయ్యి ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉన్నట్లు ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. భారత్‌లో ముంబై కేంద్రంగా పనిచేస్తన్న ఫియట్‌.. మహారాష్ట్ర, తమిళనాడులోనూ విస్తరించింది. దాదాపు 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వాహన తయారీ సంస్థలకు కావాల్సిన సాంకేతిక వ్యవస్థను తెలంగాణలోనే అభివృద్ధి చేస్తామని ఫియట్ సంస్థ ప్రకటించింది. అందులో భాగంగా కనెక్టెడ్‌ వెహికల్‌ సర్వీసెస్‌, డేటా సైన్సెస్‌, క్లౌడ్‌ సర్వీసెస్‌ వంటి కొత్త సాంకేతికతలపై దృష్టి సారించనున్నామని తెలిపింది. వ్యాపార, వాణిజ్య రంగాలకు ఉన్న అనుకూల విధానాలతో పాటు స్కిల్, క్రియేటివిటి.. కలగలిపిన సంస్కృతి అందుబాటులో ఉన్నందునే హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నామని ఫియట్‌ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు.