6 నెలల చికిత్స తర్వాత మళ్లీ దర్జాగా నిల్చున్న 700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి

  • Published By: naveen ,Published On : November 17, 2020 / 11:27 AM IST
6 నెలల చికిత్స తర్వాత మళ్లీ దర్జాగా నిల్చున్న 700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి

pillalamarri banyan tree: ఊడలు ఊడినా.. చెట్టు చెక్కు చెదరలేదు. చెదలు పీడించినా.. కాండం కుంగలేదు. ఎన్ని విపత్తులొచ్చినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. తట్టుకుంది. పడిపోతుందనుకున్న టైంలో.. అటవీశాఖ చేపట్టిన ట్రీట్‌మెంట్‌తో మళ్లీ ఠీవీగా నిల్చుంది పాలమూరు ఐకాన్ పిల్లలమర్రి. భవిష్యత్ తరాలకు కూడా.. తాను ఇలాగే దర్జాగా నిల్చుంటానని చెబుతోందిప్పుడు. తన చరిత్ర ఇప్పట్లో ముగిసేది కాదని మరోసారి చాటింది మహావృక్షం పిల్లలమర్రి.

ఈ మహా వృక్షానికి 700 ఏళ్ల చరిత్ర:
పాలమూరు పేరు వస్తే.. మొదట గుర్తొచ్చేది పిల్లలమర్రే. ఈ మహా వృక్షానికి 7 వందల ఏళ్ల చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్ పట్టణానికి.. 3 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. సరైన నిర్వహణ లేక.. చెదలు పట్టాయి. మరోవైపు నుంచి చెట్టు ఎండిపోవడం మొదలుపెట్టింది. నిండుగా ఉన్న చెట్టు.. చెదల కారణంగా బాగా దెబ్బతింది. ఊడలు ఊడిపోవడం.. ఆకులు ఎండిపోవడంతో.. కళ తప్పింది. చెదల కారణంగా ఊడలు పట్టు కోల్పోయాయ్. రెండు భారీ ఊడలు నేలకొరిగాయి కూడా. అలాంటి సమయంలో.. అటవీశాఖ రిటైర్డ్ ఆఫీసర్ బాంజ ఇచ్చిన సాంకేతిక సలహాతో.. ఇప్పుడు మర్రి చెట్టు స్వరూపమే మారిపోయింది.

క్లోరోపైరిపాస్ ద్రావణంతో ట్రీట్‌మెంట్:
మర్రిచెట్టు ఊడలకు చెదలు పట్టడంతో.. అధికారులు సెలైన్ బాటిళ్లలో క్లోరోపైరిపాస్ ద్రావణాన్ని నింపి.. ట్రీట్‌మెంట్ చేశారు. ఊడల మొదళ్ల పాదుల దగ్గర మట్టిలో జీవం పోయి చెదలు పట్టడంతో.. కొత్త మట్టిని నింపారు. నేలకొరిగిన ఊడలకు కొన్ని చోట్ల రంధ్రాలు ఏర్పాటు చేశారు. వాటికి.. పీవీసీ పైపులను అమర్చి.. వాటి ద్వారా క్లోరోపైరిపాస్ ద్రావణాన్ని సప్లై చేశారు. పిల్లలమర్రికి బలాన్నిచ్చేందుకు.. జీవామృతం ద్రావణాన్ని కూడా వినియోగించారు.
https://10tv.in/good-days-for-tsrtc/
6 నెలలు పిల్లలమర్రికి చికిత్స:
సందర్శకుల తాకిడితో.. పిల్లలమర్రికి ఉన్న సన్నని ఊడలు ఊడిపోయాయ్. దీంతో.. అటవీశాఖ అధికారులు 6 నెలల పాటు సందర్శకులను నిలిపివేసి.. పిల్లలమర్రికి చికిత్స చేశారు. కొత్తగా సన్నని దారపు పోగుల్లా వచ్చే ఊడలు.. నేలలోకి దిగేలా ఊడలకు 4 అంగుళాల పైపులను ఏర్పాటు చేశారు. ఇలా.. రెండు దశల్లో 90 చోట్ల కొత్త ఊడలను సంరక్షించేందుక పైపులను మట్టితో నింపారు. ఏడాదిలోనే.. ఊడలు బాగా పెరిగి.. నేలలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో.. ఈ మహావృక్షం ఇప్పుడు దర్జాగా నిలబడింది. నిండా కొత్త ఆకులతో కళకళలాడుతోంది. మరో 50 చోట్ల ఊడల సంరక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. మహావృక్షం ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని.. అటవీశాఖ అధికారి గంగారెడ్డి చెబుతున్నారు.

అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ చేసిన కృషితో.. అటవీశాఖ అధికారులు చికిత్స ప్రారంభించారు. వాళ్లు చేసిన ట్రీట్‌మెంట్ ఇప్పుడు సత్ఫలితాలనిస్తోంది. పడిపోయిన ఊడలు.. మళ్లీ జీవం పోసుకుంటుండటంతో.. పిల్లలమర్రి తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంది.