శ్రీశైలం పవర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..9 మంది ఉద్యోగులు గల్లంతు

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 06:17 AM IST
శ్రీశైలం పవర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..9 మంది ఉద్యోగులు గల్లంతు

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్నశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది.



భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.



ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది మహిళా ఉద్యోగులున్నట్లు సమాచారం. సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ 9 మంది ఉద్యోగుల ఆచూకీ తెలియడం లేదు.

గల్లంతైన వారిలో డీఈ, నలుగురు ఏఈలు, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విద్యుత్ కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీమ్, అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.



చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దట్టంగా పొగ అలుముకోవడంతో లోపలకు వెళ్లలేకపోతున్నారు. ఎలాగైనా వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు సార్లు లోపలకు వెళ్లి తిరిగి వచ్చారు.



ఘటనాస్థలంలో అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రమాదం కారణంగా..జల విద్యుత్ కేంద్రం అంధకారంగా మారిపోయంది. గాయపడిన వారిని జెన్కో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.