అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు

అమెరికాలో తెలుగు యువకుడిపై కాల్పులు

అమెరికాలో దారుణం జరిగింది. తెలుగు యువకుడిపై కాల్పులు జరిగాయి. పూస సాయికృష్ణపై డెట్రాయిట్ రాష్ట్రంలో కాల్పులు జరగగా.. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆఫీస్ నుంచి ఇంటికి కారులో వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. సాయికృష్ణ దగ్గరున్న డబ్బు లాక్కున్నారు. గుర్తింపు పత్రాల తీసుకుని అతడి కారులోనే వెళ్లిపోయారు. పూస సాయికృష్ణది మహబూబాబాద్‌ పట్టణం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2019 జనవరి 3వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇది దోపిడీ దొంగల పనే అని పోలీసులు తేల్చారు. కాల్పుల ఘటన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సాయికృష్ణ పరిస్థితి ఎలా ఉందో తెలియక కంగారు పడుతున్నారు. అమెరికాలో తెలుగువారిపై తరుచుగా చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలు అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐలని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
జాబ్‌లో చేరిన మూన్నాళ్లకే:
సాయికృష్ణ  మిచిగాన్ రాష్ట్రంలోని లారెన్స్ టెక్ యూనివర్సిటీలో ఎలక్టిక్రల్ ఇంజినీరింగ్ చదివాడు. ఇటీవలే డెట్రాయిట్‌లోని ఆటోమోటివ్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. రోజూలాగే ఆపీస్ నుంచి కారులో ఇంటికెళ్తున్నాడు. రాత్రి 11.30గంటల సమయంలో కొందరు దుండగులు అడ్డు వచ్చి కారుని ఆపారు. గన్‌తో భయపెట్టి కారులోకి ఎక్కారు. నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సాయికృష్ణ నుంచి డబ్బు, పత్రాలు లాక్కున్నారు. తర్వాత సాయికృష్ణ నోట్లో గన్ పెట్టి కాల్చారు. అనంతరం అదే కారులో వెళ్లిపోయారు. నిస్సహాయ స్థితిలో రక్తమోడుతూ గడ్డ కట్టే చలిలో చాలాసేపు సాయికృష్ణ అలాగే రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. ఇంతలో అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు సాయికృష్ణని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆపరేషన్ కోసం రూ.2కోట్లు:
సాయికృష్ణ తీవ్రంగా గాయడపడ్డాడని వైద్యులు తెలిపారు. అనేక సర్జరీలు చేయాల్సి ఉంటుందని, దీని కోసం 2కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. అయితే సాయికృష్ణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పైగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. దీంతో ఎన్ఆర్ఐలు ముందుకొచ్చారు. సాయికృష్ణ వైద్య చికిత్సల కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 50లక్షల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి. పెద్ద మనసుతో ముందుకు రావాలని సాయికృష్ణ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుని భరించాలని కోరుతున్నారు.