Godavari Floods : వరద ముప్పు..! మళ్లీ టెన్షన్ పెడుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం..

భద్రాచలం వద్ద గోదావరి మరోసారి టెన్షన్ పెడుతోంది. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.

Godavari Floods : వరద ముప్పు..! మళ్లీ టెన్షన్ పెడుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం..

Godavari Floods : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి టెన్షన్ పెడుతోంది. గంటగంటకూ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. భద్రాచలం నుంచి 9లక్షల 71వేలకు పైగా క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది.

జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. ఆ బీభత్సాన్ని మరువకముందే.. తాజాగా మరోమారు భద్రాచలం వద్ద గోదావరికి వ‌ర‌ద పోటెత్త‌డంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక పెరుగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రాద్రి జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరిలో 37.19 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. ప్రభావితం అయ్యే కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహకంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ అప్రమత్తం చేశారు. సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. తక్షణమే సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి ప్రవాహం భారీగా వచ్చింది. వారం రోజులు ఏకధాటిగా కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి దిగువకు వస్తున్న వరద నీటి మట్టం భద్రాచలం వద్ద తీవ్ర స్థాయికి చేరింది. దీంతో భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. 1986 తర్వాత మొదటిసారిగా గోదావరి వంతెనపై రాకపోకలను రెండు రోజుల పాటు బంద్ చేశారు.