శ్రీశైలం వెళ్లే భక్తులపై ఆంక్షలు..అటవీ ప్రాంతంలో చలిమంటలు, వంటకాలపై నిషేధం

శ్రీశైలం వెళ్లే భక్తులపై ఆంక్షలు..అటవీ ప్రాంతంలో చలిమంటలు, వంటకాలపై నిషేధం

restrictions on devotees going to Srisailam : నల్లమల్ల అగ్నిప్రమాదం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే భక్తులపై ఆంక్షలు విధించారు. శ్రీశైలం వెళ్లే శివస్వాములు అటవీ ప్రాంతంలో ఎక్కడా చలిమంటలు వేయకూడదని ఫారెస్ట్‌ శాఖ తేల్చి చెబుతోంది. అంతేకాదు అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణించే వారు మార్గమధ్యంలో ఎక్కడా వంటకాలు చేయవద్దని సూచిస్తోంది. అటవీ ప్రాంతంలో ఎవరైనా వంటలు చేసినా, చలిమంటలు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వీటితో పాటు వేసవి కాలం ముగిసే వరకు టైగర్‌ జోన్‌లో అగ్నిప్రమాదాలు జరగకుండా 20 మంది సిబ్బందితో ప్రత్యేక టీమ్‌లు నియమించింది.

నల్లమల్లలో రేగిన కార్చిర్చు అదుపులోకి వచ్చింది. ఫైర్‌ సిబ్బంది నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కార్చిచ్చు చెలరేగిన నాలుగైదు గంటల్లోపే మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులపై ఆంక్షలు విధించించి అటవీశాఖ.

నల్లమల్లలో చెలరేగిన మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫారెస్టు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఫారెస్టు సిబ్బంది శ్రమించి మంటలు అదుపు చేశారు. అర్ధరాత్రి వేళ పగటిని తలపించేలా ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, కళ్లు మండేలా సెగలు కక్కుతున్న దట్టమైన పొగలను లెక్క చేయకుండా సుమారు 20 మంది ఫారెస్టు సిబ్బంది మంటలతో పోరాటం చేశారు.

అధునాతన పరికరాల సాయంతో అర్థరాత్రి వేళ అడవిలోకి చొచ్చుకెళ్లి కార్చిచ్చును చల్లార్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో అడవి తగలబడింది. త్వరగా మంటలు అదుపులోకి తెచ్చామని లేదంటే వందల ఎకరాల అడవి బుగ్గిపాలైయ్యేదని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు.

నాగర్‌ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. NHA అక్టోపస్‌ నుంచి నీలారం బండ, థౌసు పెంటల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే కార్చిచ్చులా మారి వనమంతా విస్తరించడం మొదలైంది.