RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా

మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ లో తెలిపారు.

RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా

Rs Praveen Kumar

RS Praveen Kumar : మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ లో తెలిపారు. ”రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్‌ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నా. నాకు చాలా స్వల్ప లక్షణాలున్నాయి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అంటూ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

రెండు రోజుల క్రితం నల్లగొండ ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ లక్షమందితో భారీ సభ నిర్వహించారు. రాజ్యాధికార సంకల్ప సభలో బీఎస్పీ నేషనల్‌ కోఆర్డినేటర్‌ రామ్‌జీ గౌతమ్‌ సమక్షంలో ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో(బహుజన సమాజ్‌ పార్టీ) చేరారు. ఈ సభకు భారీ ఎత్తున జనాలు వచ్చారు. చాలామంది కరోనా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రవీణ్ కుమార్ కూడా మాస్క్ పెట్టుకోకుండానే సభలో పాల్గొన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు సంచలనంగా మారారు. ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా, టీఆర్ఎస్ పార్టీలో చేరతారని కొందరు, బీఎస్పీలో చేరతారని మరికొందరు.. సొంతంగా పార్టీ పెడతారని ఇంకొందరు చెప్పారు. చివరికి ఆయన బీఎస్పీలో చేరారు. బహుజన రాజ్యాధికారం కోసమే తాను ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలు అప్పుడే అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు ప్రవీణ్ కుమార్. ఏడేళ్లుగా దళితులపై లేని ప్రేమ హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలోనే ఎందుకు పుట్టుకొచ్చిందని నేరుగా సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. దళితబంధు పేరుతో మరోసారి దళితులను పావుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం కోసం ఖర్చు చేసే నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని సూచించారు.

ప్రవీణ్ కుమార్ విమర్శలను టీఆర్ఎస్ నేతలు అదే స్థాయిలో తిప్పికొట్టారు. ఆయనపై మాటల యుద్ధానికి దిగారు. ఉద్యోగం పోతుందన్న భయంతోనే ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఒక్క రూపాయి దళితుల కోసం పని చేయకుండా, ఇస్తామన్న ఉద్యోగులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఉండి.. ఇష్టారీతిగా వ్యవహరిస్తే కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఉద్యోగం ఉంటుందో, పోతుందోనన్న భయాందోళనతో జాతికోసం బయటకు వస్తున్నట్లు నాటకమాడారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.