టీఆర్ఎస్ గ్రేటర్ మేయర్ అభ్యర్ధిగా గద్వాల్ విజయలక్ష్మి

టీఆర్ఎస్ గ్రేటర్ మేయర్ అభ్యర్ధిగా గద్వాల్ విజయలక్ష్మి

Gadwal Vijayalakshmi as TRS Greater Mayor candidate : గ్రేటర్ టీఆర్ఎస్ మేయర్ అభ్యర్ధిగా గద్వాల్ విజయలక్ష్మి పేరు, డిప్యూటీ మేయర్‌ అభ్యర్ధిగా మోతే శ్రీలతారెడ్డి పేరు ఖరారయ్యాయి. టీఆర్ఎస్ కార్పొరేటర్లంతా తెలంగాణ భవన్ చేరుకున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికాసేపట్లో మంత్రి కేటీఆర్ వారితో సమావేశం కానున్నారు. మెజార్టీ దక్కకపోయినా గ్రేటర్‌లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీగా తమకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు లభిస్తాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు.

ఉదయం 8.30 గంటలకు తెలంగాణ భవన్‌కు రావాలని సభ్యులను ఆదేశించారు. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్లనున్నారు టీఆర్ఎస్ కార్పొరేటర్లు. మంత్రులు కేటీఆర్, తలసాని, ఎంపీ కేశవరావు ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను పర్యవేక్షించనుంది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం..అభ్యర్ధి పేరు ఉన్న సీల్డ్ కవర్‌ను ఎన్నికల విప్ ప్రభాకర్ తెరవనున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ అధికార పార్టీకి దక్కకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. టిఆర్‌ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిని సీల్డ్ కవర్లో వెల్లడిస్తామని.. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. మేయర్ ఎన్నిక వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు కసరత్తు పూర్తి చేశారు.

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఏకగ్రీవమైతే.. అధికార పార్టీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు. పోటీ అనివార్యమైతే ఎలా వ్యవహరించాలన్న అంశంపై కూడా ప్రణాళికలను అధికార పార్టీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మేయర్ స్థానం కైవసం చేసుకునేందుకు విపక్ష పార్టీలకు అవసరమైన బలం లేకపోవడం కూడా తమకు కలిసి వస్తుందని గులాబీ నేతలంటున్నారు..

ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థిని బరిలో ఉంచుతామని ప్రకటించింది. ఎంఐఎం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటారు. ఈ పరిస్థితుల్లో మేయర్ ఎన్నికకు ఓటింగ్ తప్పని సరి అవుతుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ పార్టీకీ ఆపార్టీ అన్నట్లుగా వ్యవహారం ఉంది. బీజేపీ-టీఆర్ఎస్ సహకరించుకునే పరిస్థితి లేదు.

ఒకవేళ వాళ్లిద్దరూ కలిస్తే.. సభ్యుల సంఖ్యా బలం 103కు చేరుతుంది. కానీ అది సాధ్యం కాదని రాజకీయ వర్గాలంటున్నాయి. ఎంఐఎం కూడా టీఆర్ఎస్‌తో కలిసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో.. ఎవరికి వారు పోటీలో ఉంటే.. అధిక సభ్యుల బలం ఉన్న టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని ఈజీగా దక్కించుకుంటుంది.