Gandhi Hospital : పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ..

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ ముప్పు తీవ్రంగా ఉంది. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Gandhi Hospital : పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ..

Gandhi As A Full Fledged Covid Hospital

Gandhi as a full fledged covid Hospital : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్‌ ముప్పు తీవ్రంగా ఉంది. కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ చికిత్సకు కేటాయించింది. గాంధీ ఆస్పత్రిలో ఓపీ నిలిపివేయాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

గాంధీ ఆస్పత్రిలో మొత్తం 18 వందల 60 బెడ్స్ ఉన్నాయి. ఇప్పటికే 500 మందికిపైగా కోవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 150 మంది హాస్పిటల్‌లో చేరారు. అలాగే 450 వెంటిలేటర్ బెడ్స్ భర్తీ అయ్యాయి. కేసులు పెరుగుతున్నందున నాన్ కోవిడ్ విభాగాన్ని కూడా కరోనా చికిత్స కోసం వినియోగంలోకి తెచ్చామని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపివేస్తున్నారు.

గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందించడానికి అన్ని రకాల సిబ్బంది కలిపి 19 వందల మంది ఉన్నారు. వైద్య కళాశాల సిబ్బందిని, వైద్యులను కలిపి రెండు వేల తొమ్మిది వందల మంది వరకు ఉంటారు. ఆసుపత్రిలో 24 గంటలూ వైద్యం అందిస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో మూడు వేల పడకలకు సరఫరా చేసేంత ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయని సూపరింటెండెంట్ చెప్పారు.

గచ్చిబౌలీ టిమ్స్‌లో వెయ్యి పడకలుంటే సగానికిపైగా నిండిపోయాయి. కింగ్‌ కోఠి, ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేవు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ పడకలు ఐదు వేల 72 ఉండగా.. ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ బెడ్స్ కలిపి ఎనిమిది వేల రెండు వందల 22 ఉన్నాయి. మొత్తం 13 వేల రెండు వందల 94 బెడ్స్ ఇంకా సగం వరకు ఖాళీ ఉన్నట్లు కనిపిస్తోంది. జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ కోవిడ్ రోగులతో నిండిపోయాయి.