కరోనా మృతదేహం తారుమారు..గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

  • Published By: bheemraj ,Published On : June 9, 2020 / 07:13 PM IST
కరోనా మృతదేహం తారుమారు..గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఒక మృతదేహం బదులు మరో మృతదేహం అప్పగించారు. మృతదేహం మారిన విషయాన్ని మృతుడి బంధువులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యులతో గొడవకు దిగారు. 

ఓ కుటుంబ సభ్యులు స్మశాన వాటికకు వెళ్లిన తర్వాత పరిశీలించి డెడ్ బాడీ తారుమారు అయ్యిందంటూ గుర్తించారు. ఇది తమ కుటుంబానికి సంబంధించిన బంధువు కాదని డెడ్ బాడీని తిరిగి వెంటనే గాంధీకి తీసుకెళ్లారు. తమ బంధువు డెడ్ బాడీ కావాలంటూ గొడవ చేశారు. మృత దేహాలను మార్చి ఇచ్చారంటూ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. మార్చురీకి వెళ్లి వారి బంధువు డెడ్ బాడీ చూసుకున్నారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేగంపేట గురుమూర్తినగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జూన్ 7న కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 9, 2020) ఉదయం మృతి చెందాడు. మృతుని బావమరిది గాంధీ మార్చురీకి వెళ్లి దూరం నుంచి చూసి తన బావ మృతదేహమేనని నిర్ధారించాడు. వైద్య సిబ్బంది మృతదేహాన్ని బేగంపేటలోని శ్మశానవాటికకు తరలించారు. 

అయితే కడసారి చూపు కోసం వచ్చిన మృతుని భార్య మృతదేహం తన భర్తది కాదని స్పష్టం చేసింది. దీంతో మృతుని కుటుంబసభ్యులు, వైద్యసిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బేగంపేట పోలీసులు రంగంలోకి దిగి ఇరువురికి సర్ధి చెప్పారు. మార్చురీలో ఉన్న గురుమూర్తినగర్‌కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని తిరిగి అప్పగించారు. 

మరోవైపు ఐసీయూలో కూడా పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. కరోనా పాజిటివ్ పేషెంట్ సడెన్ గా లేచి బాత్ రూమ్ కు వెళ్తున్న సమయంలో కుప్పకూలి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. తనతో పాటు ఉన్న పాజిటివ్ బంధువు ఇంకొకరు సెలైన్ బాటిల్ ఎక్కించే రాడ్ తో జూనియర్ డాక్టర్ పై దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. 

తమపై దాడికి పాల్పడ్డారని గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. దీంతో వైద్యులు ధర్నాకు దిగారు. ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. పోలీసులు కూడా గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు.