తీన్‌మార్ స్టెప్పుల్లేవ్‌.. హుస్సేన్ సాగర్ కు తరలిన ఖైరతాబాద్ గణేష్

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 12:47 PM IST
తీన్‌మార్ స్టెప్పుల్లేవ్‌.. హుస్సేన్ సాగర్ కు తరలిన ఖైరతాబాద్ గణేష్

గతంలో ఎన్నడూ లేని విధంగా నిరాడంబరంగా వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. గణేష్ పండుగ అనగానే..హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో ఉండే..ఈ వినాయకుడిని చూడటానికి ఎంతో మంది హైదరాబాద్ కు వస్తుంటారు.



కానీ..ప్రస్తుతం కరోనా కారణంగా..ఎలాంటి సందడి లేకుండానే..ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ కు తరిలాడు. కోవిడ్ నిబంధనల ప్రకారం..నిమజ్జనం ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. భక్తులు తరలిరావొద్దని సూచించినా…తక్కువ సంఖ్యలోనే గణనాథుడిని దర్శించుకున్నారు.

మధ్యాహ్నం 03 గంటలకు నిమజ్జనం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. టెలిఫోన్‌ భవన్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్‌ నెం.4 దగ్గర గణేశుడి నిమజ్జనం కానుంది. సీసీ టీవీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు నడుమ నిమజ్జనం జరుగుతోంది.



ఖైరతాబాద్ గణేషుడ విషయానికి వస్తే…
ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి 2020, ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువు దీరాడు. గతంలో కంటే విభిన్నంగా 9 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించారు. కరోనాకు వ్యాక్సిన్ తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా ఏర్పాటు చేసినట్లు, చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో గణేష్ ఉన్నాడు. ఇక వినాయకుడి కుడివైపున మహాలక్ష్మీ దేవి, ఎడమవైపున సరస్వతి విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్‌లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రసాదం అందించారు. దీనిని భక్తులకు ప్రసాదంగా అందచేయనున్నారు.



తొలిసారిగా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం.. ఏటా అడుగు చొప్పున పెంచుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరింది. అయితే కరోనా కారణంగా ఈసారి 9 అడుగుల ఎత్తులోనే వినాయక విగ్రహాన్ని రూపొందించారు.