ఎంతో ఆశపడ్డారు, వడ్డీ మాఫీ చేసినా వచ్చింది రూ.18 కోట్లే, ఆస్తిపన్ను వసూళ్లపై లాక్‌డౌన్‌ ప్రభావం

  • Published By: naveen ,Published On : August 18, 2020 / 09:36 AM IST
ఎంతో ఆశపడ్డారు, వడ్డీ మాఫీ చేసినా వచ్చింది రూ.18 కోట్లే, ఆస్తిపన్ను వసూళ్లపై లాక్‌డౌన్‌ ప్రభావం

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావం మామూలుగా లేదు. ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. ఉపాధి లేక ఆదాయం లేక నలిగిపోతున్నారు. ముఖ్యంగా కూలీలు, నిరుపేదలపై తీవ్రమైన ప్రభావం పడింది. అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంపైనా పడింది. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గింది. ఇందుకు జీహచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్లే నిదర్శనం. వడ్డీ మాఫీ చేసినా పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఆస్తిపన్ను చెల్లించడానికి బకాయిదారులు ముందుకు రావడం లేదు.



వడ్డీ మాఫీ ప్రకటించి 15రోజులు దాటినా రూ.18 కోట్లు మాత్రమే వసూలు:
బల్దియా ఆస్తి పన్ను వసూళ్లపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా చూపింది. వడ్డీ మాఫీ ప్రకటించి 15 రోజులు దాటినా కేవలం రూ.18 కోట్లు మాత్రమే జీహెచ్‌ఎంసీ వసూలు చేయగలిగింది. గత ఆర్థిక సంవత్సరం 2019-20 ముగిసే నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.2495.62 కోట్లు వసూలు కావాల్సి ఉండగా.. వచ్చే సెప్టెంబర్‌ 15 నాటికి బకాయిలు చెల్లించే వారికి వడ్డీలో 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఊహించిన దానికంటే తక్కువ వసూలు కాగా పన్ను చెల్లింపులపై లాక్‌డౌన్‌ ప్రభావం పడినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.



బకాయిల వసూలు కోసం వన్‌ టైమ్‌ అమ్నెస్టీ స్కీమ్‌ (OTAS‌):
జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను జాబితాలో 16,05,556 ఆస్తులుండగా, వాటిపై ఏటా రూ.1410.83 కోట్ల మేరకు పన్ను డిమాండ్‌ ఉంది. అసెస్‌మెంట్లలో హెచ్చుతగ్గులు, ఖాళీ, శిథిలావస్థకు చేరిన భవనాలు, కుటుంబ సభ్యుల తగాదాలు, యజమానులు, అద్దెదారుల వివాదాలు తదితర కారణాలతో దాదాపు 5.64 లక్షల మంది 15 నుంచి 20 ఏళ్లుగా పన్నులు సరిగా చెల్లించడం లేదు. దీంతో 2019-20 ముగిసే నాటికి రూ. 1477.86 కోట్ల మేర పన్ను బకాయి, అలాగే వీటిపై రూ. 1017.76 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. దీంతో బకాయిల వసూలు కోసం ప్రభుత్వం వన్‌ టైమ్‌ అమ్నెస్టీ స్కీమ్‌ (ఓటీఏఎస్‌)ను ప్రవేశపెట్టింది.



రూ.1600 కోట్లు వసూలు కావాలి:
ఆగస్టు 1వ తేదీ నుంచి 45 రోజుల్లోగా పన్నులు చెల్లించే వారికి వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే జీహెచ్‌ఎంసీకి వడ్డీతో కలిపి రావాల్సిన పన్ను బకాయిలు రూ.2495 కోట్లు. ఇందులో వడ్డీలో 90 శాతం, అంటే సుమారు రూ.900 కోట్లు మాఫీ కాగా మిగిలిన రూ.1600 కోట్లు వసూలు కావాలి. రోజుకు సగటున రూ.35 కోట్లు వసూలైతే జీహెచ్‌ఎంసీకి రావాల్సిన బకాయిలన్నీ 45 రోజుల్లో వసూలు అవుతాయి. కానీ ఆగస్టు 1వ తేదీ నుంచి 17 వరకు వసూలైన బకాయిలు మొత్తం రూ.18 కోట్లు మాత్రమే. దీంతో రావాల్సిన అసలు బకాయిలకు, వసూలవుతున్న వాటికి ఏ మాత్రం పొంతన కుదరడం లేదు.



వ్యాపారాలు లేకపోవడంతో పన్నులు కట్టడానికి ముందుకు రావడం లేదు:
పన్ను చెల్లింపు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వారికి రూ.900 కోట్ల ప్రయోజనం చేకూరుతుండగా పాత బకాయిలు వసూలైతే జీహెచ్‌ఎంసీకి రూ.1477.86 కోట్ల మేర అసలు ఆదాయం సమకూరనున్నది. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు మూడు నెలలు వ్యాపారాలు మూతపడడం, ప్రస్తుతం తెరుచుకున్నా మునుపటి మాదిరిగా వ్యాపారాలు కొనసాగకపోవడంతో పన్నులు చెల్లించేందుకు బకాయిదారులు ముందుకు రావడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ మాఫీ ద్వారా పన్ను బకాయిదారులకు ప్రయోజనం కలగడంతో పాటు బకాయిల వసూళ్ల ద్వారా తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడం వారిని నిరాశకు గురిచేసింది.