గ్రేటర్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం : మూగబోయిన మైకులు… సైలెంటైన నేతలు

  • Published By: bheemraj ,Published On : November 29, 2020 / 06:59 PM IST
గ్రేటర్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం : మూగబోయిన మైకులు… సైలెంటైన నేతలు

GHMC Election campaign end : 13 రోజులుగా హోరాహోరీగా సాగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గల్లీగల్లీల్లో తిరిగి ప్రచారం నిర్వహించిన నేతలు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఊరువాడా ఏకం చేసేలా మోగిన మైకులు మూగబోయాయి. నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. జీహెచ్‌ఎంసీ బరిలో 1,122 మంది అభ్యర్థులు నిలిచారు. డిసెంబర్ 1న ఎన్నికలు జరుగున్నాయి.



అన్ని పార్టీలు గ్రేటర్‌ పీఠాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. కూల్‌గా మొదలైన ప్రచారం చివరకు చేరేసరికి సెగలు పుట్టించింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడగా… కాంగ్రెస్‌, టీడీపీలు సైలెంట్‌గా ప్రచారాన్ని సాగించాయి.



గతంలో ఎన్నడూ లేనంత వాడివేడిగా సాగింది. గ్రేట‌ర్ ఓట‌రును ప్రస‌న్నం చేసుకునేందుకు అన్నీ పార్టీలు పూర్తిగా ఎఫ‌ర్ట్స్ పెట్టాయి. ఓట‌రును ఆక‌ట్టుకునేందుకు త‌మ‌వైపు తిప్పుకునేందుకు పార్టీలు చేయ‌ని ప్రయ‌త్నం లేదు. మేయ‌ర్ ఫీఠ‌మే ల‌క్ష్యంగా సాగిన పార్టీల ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి యుద్ధాన్ని తలపించింది. GHMC ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే పార్టీలు ప్రచార పర్వంలోకి దిగిపోయాయి.



మొదట TRS, కాంగ్రెస్‌ల మధ్య విమర్శలతో ప్రచారం మొదలైంది. తర్వాత బీజేపీ వల్లే వరదసాయం ఆగిందన్న ఆరోపణలతో సీన్ మారిపోయింది. TRS, BJP మధ్య హోరాహోరీ సమరం సాగింది. TRS తరపున కేటీఆర్ ప్రచార భారాన్ని మోసారు. ఎల్‌బీ స్టేడియంలో సభతో కేసీఆర్ హీట్ పుట్టించారు.


ఇక బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు జాతీయనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్‌ హడావుడి మాత్రం అంతలా కనిపించలేదు. వలసలతో కాంగ్రెస్‌ అల్లాడింది. స్టార్‌ క్యాంపెయినర్లు కూడా ప్రచారంలో కనిపించలేదు.

మొత్తానికి కూల్‌గా మొద‌లైన గ్రేట‌ర్ ప్రచారం చివ‌రికి వ‌చ్చేస‌రికి తుఫాన్‌గా మారింది. అభివృద్ది ఎజెండా ప‌క్కకు పోయి.. వివాద‌స్పద కాంమెంట్స్‌తో.. గ్రేట‌ర్ ప్రచారం దడదడలాడింది. ఇక ఎల్లుండి జరిగే పోలింగ్‌లో ఓటరు ఎవరిని హైదరాబాద్‌ బాద్‌షాగా నిలుపుతారో చూడాల్సి ఉంది.