జీహెచ్ఎంసీ ఎన్నికలు : రెండో సర్వే రిపోర్టు, బహిరంగసభలో కేసీఆర్ కీలక ప్రకటనలు ?

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 07:23 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : రెండో సర్వే రిపోర్టు, బహిరంగసభలో కేసీఆర్ కీలక ప్రకటనలు ?

Ghmc Election : జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో కేటీఆర్ అన్నీతానై వ్యవహరించి 99 సీట్లలో పార్టీని గెలిపించి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాయి. మేనిఫెస్టోల్లో నగర ఓటర్లపై హామీల వర్షాన్ని గుప్పించాయి. దీంతో సీఎం కేసీఆర్ ఎంట్రీకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే కాదు.. వాళ్ల హామీలు నీటిమూటలన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరముందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కాంగ్రెస్, బీజేపీకి చెక్‌పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. ఆ పార్టీలకు పట్టున్న డివిజన్లపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు. గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే విపక్షాలను తిప్పికొట్టాలని ఆయా డివిజన్ల ఇంచార్జ్‌లకు సూచించారు కేసీఆర్. బడుగుబలహీన వర్గాలవారికి ఆర్థికంగా వెనుకబడిన వారిపై మేనిఫెస్టోలో వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి.. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.



ఒకవైపు మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తుంటే… మరోవైపు ఆయా డివిజన్లలో మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మకాం వేసి ఓటర్లను ఆకర్షించేపనిలో నిమగ్నమయ్యారు. అయితే సీఎం కేసీఆర్ 120 డివిజన్లలోని పరిస్థితులు.. పార్టీకి, అభ్యర్థికి ఉన్న జనాదరణపై మొదటి సర్వే రిపోర్టును తెప్పించుకున్నారు సీఎం కేసీఆర్. ఆ రిపోర్టుల ఆధారంగానే ఇప్పటివరకు ప్రచారం నిర్వహిస్తూ.. అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఇప్పుడు రెండో సర్వే రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.



https://10tv.in/bjp-operation-akarsh-mukesh-goud-son-vikram-goud-likely-join-in-bjp/
శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభ కు ముందుగానే రెండో సర్వే రిపోర్టులు సీఎం కేసీఆర్ చేతికి అందనున్నాయి. ఈ సర్వే రిపోర్టు ఆధారంగానే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు చేసే అవకాశముందని.. అవే అభ్యర్థుల గెలుపుకు బాటలు వేస్తాయని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మొదటి సర్వేలో టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉన్నప్పటికీ… రెండో సర్వే రిపోర్ట్ ను కూడా సీఎం కేసీఆర్ అత్యంత ప్రామాణికంగా తీసుకోబోతున్నారని సమాచారం.



దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడంతో బల్దియాను సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో పాటు 2016లో కంటే అధికస్థానాల్లో గెలవాలని వ్యూహ రచనలు చేస్తున్నారు. అందుకే రెండో సర్వే రిపోర్ట్ ఆధారంగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. ఆ సభలోనే మేనిఫెస్టోలో పొందుపరచని మరిన్ని హామీలు ఇచ్చే అవకాశముందంటున్నారు టీఆర్ఎస్ నేతలు.