మోగనున్న గ్రేటర్ ఎన్నికల నగారా

  • Published By: bheemraj ,Published On : November 17, 2020 / 10:19 AM IST
మోగనున్న గ్రేటర్ ఎన్నికల నగారా

GHMC election : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగనుంది. రాజకీయ పార్టీలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న GHMC ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఈ రోజే షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 1న ఎన్నికలు, డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడించే సూచనలు కనిపిస్తున్నాయి.



ఎన్నికల ప్రక్రియ మొత్తం 20రోజుల్లోపే పూర్తి చేయనుంది ఈసీ. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. సాఫ్ట్ వేర్ రూపొందించడం కోసం సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ ఓటింగ్ అంశంలో ఎలక్షన్ కమిషన్ వెనక్కి తగ్గింది. GHMCలోని 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.



ఇటీవలే ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్…ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 74లక్షల 4వేల 286 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో పురుషుల సంఖ్య 38లక్షల 56వేల770 కాగా, అన్ని డివిజన్లలో కలిపి 35లక్షల 46వేల847 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మైలార్ దేవరపల్లిలో అత్యధికంగా 79వేల290 మంది ఓటర్లుండగా, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27వేల998మంది ఓటర్లున్నారు.



https://10tv.in/cm-kcr-focus/
జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం పాలకమండలి మొదటి సమావేశం జరిగినప్పటి నుంచి ఐదేళ్లపాటు పదవీకాలం ఉంటుంది. ప్రస్తుత పాలకమండలి సమావేశం 2016 ఫిబ్రవరి 11వ తేదీన జరిగింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఉంటుంది. మూడు నెలలలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు, కొత్త పాలకమండలి ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉండడంతో ఎన్నికల ప్రక్రియ చేపట్టింది కమిషన్‌…ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడిని 20 రోజుల్లోపే ప్రకటించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.