జోరు పెంచిన బీజేపీ : జీహెచ్ఎంసీ ఎన్నికలు, అమిత్ షా, యోగి ప్రచారం

  • Published By: madhu ,Published On : November 28, 2020 / 07:04 AM IST
జోరు పెంచిన బీజేపీ : జీహెచ్ఎంసీ ఎన్నికలు, అమిత్ షా, యోగి ప్రచారం

Amit Shah, Yogi campaign : గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… కమలం పార్టీ స్పీడ్ పెంచింది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. తమ అమ్ముల పొదిలోంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ నాయకులను మోహరిస్తోంది. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు అందరూ భాగ్య నగరానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ గ్రేటర్‌లో పర్యటించి వెళ్లారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తేజస్వీ సూర్య కూడా వచ్చి వెళ్లారు.



ఇక 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా భాగ్యనగరంలో సుడిగాలి పర్యటన చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, నాగోల్‌లో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జోరు వర్షంలోనూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నడ్డా… తెలంగాణలో బీజేపీ గద్దనెక్కే సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్‌ గల్లీ ఎన్నికలకు జాతీయ నేతలు ఎందుకు వస్తున్నారన్న కేటీఆర్‌ విమర్శలకు నడ్డా కౌంటర్‌ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేయడానికే వస్తున్నామన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన ముగిసే టైమ్‌ వచ్చిందని అన్నారు.



https://10tv.in/excitement-over-kcr-speech-ghmc-election/
2020, నవంబర్ 28వ తేదీ శనివారం కూడా బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్‌లో ప్రచారం కోసం వస్తున్నారు. యూపీ సీఎం, ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ నేడు బల్దియా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆధిత్యనాథ్.. మూడు గంటలకు జీడిమెట్లలో రోడ్ షో నిర్వహిస్తారు. ఐదు గంటలకు మల్కాజ్‌గిరి‌ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉషా ముళ్లపూడి, ఆల్విన్ కాలనీ రోడ్ షోలకు హాజరవుతారు. రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున యోగి ప్రచారం చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి పాతబస్తీలోని శాలిబండ, లాల్ దర్వాజలో పబ్లిక్ మీటింగ్స్‌లో యోగీ పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి ఎనిమిదిన్నరకు యూపీకి తిరిగి ప్రయాణమవుతారు.



ఇక 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా హైదరాబాద్‌కు వస్తున్నారు. ఉదయం పదిన్నరకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. పదకొండున్నర గంటలకు ఓల్డ్‌సిటీకి వెళ్తారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌లో పూజలు చేస్తారు. ఆ తర్వాత.. 12 గంటల 15 నిమిషాల సమయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌ షోలో అమిత్ షా పాల్గొంటారు. సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ అమిత్ షా ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం నాంపల్లి పరిధిలో రోడ్ షో తర్వాత.. బీజేపీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ భోజనం అనంతరం… ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు.



దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ… గ్రేటర్‌లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది.. దీనిలో భాగంగా.. బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి రప్పిస్తోంది. ఇలా గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వంలోకి అతిరథ మహారథులందర్నీ దింపుతోంది. అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒక కార్పొరేషన్‌ ఎన్నికకు బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం, ఢిల్లీ నేతలందరూ సిటీలోని గల్లీలకు తరలిరావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది.