గ్రేటర్‌లో ఎన్నికల కోలాహలం : నామినేషన్లకు శుక్రవారమే ఆఖరి రోజు

  • Published By: madhu ,Published On : November 19, 2020 / 11:44 PM IST
గ్రేటర్‌లో ఎన్నికల కోలాహలం : నామినేషన్లకు శుక్రవారమే ఆఖరి రోజు

ghmc Elections nominations : GHMC ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థుల ఖరారులో బిజీగా ఉన్నాయి. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తును కొనసాగిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్లు ముగుస్తాయి. ఈలోపే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు జాబితాలను రిలీజ్ చేసిన పార్టీలు.. మిగిలిన అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేసేదెవరు, అతడిని ఢీకొట్టగల అభ్యర్థి ఎవరు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక సాగుతోంది.



టీఆర్ఎస్ 125 : –
అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే 125మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన వారిని శుక్రవారం ప్రకటించనుంది. మజ్లిస్‌ పోటీ చేసే స్థానాల్లోనే మెజారిటీ అభ్యర్థుల ప్రకటన చేయాల్సి ఉంది. బీజేపీ బుధవారం 21మందిని ప్రకటించగా.. గురువారం మరో 18 మందితో సెకండ్ లిస్ట్‌ విడుదల చేసింది.



కాంగ్రెస్ : –
ఇక కాంగ్రెస్‌ బుధవారం ఒక్కరోజే రెండు లిస్టులు విడుదల చేసి 45 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక గురువారం మరో రెండు జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్‌…మరో 63 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన వారి ఎంపిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీభవన్‌లో పెద్దగా ఆశావహుల సందడి కనిపించడం లేదు.



టీడీపీ : –
తెలుగుదేశం పార్టీ కూడా గ్రేటర్‌ ఎన్నికల బరిలోకి దిగింది. ఉదయం సమావేశమైన తెలంగాణ, గ్రేటర్‌ టీడీపీ నేతలు పోటీకే మొగ్గుచూపారు. దీంతో 90 మందితో ఆ పార్టీ తొలి జాబితా విడుదలైంది. శుక్రవారం మరికొంతమందిని ప్రకటించే అవకాశం ఉంది.



తెలంగాణ జనసమితి, కమ్యూనిస్టులు, జనసేన : –
కోదండరామ్‌ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి 27మందితో తొలి జాబితాను వెల్లడించింది. కమ్యునిస్టులు రెండో జాబితాను వెల్లడించారు. 26మంది పేర్లను వెల్లడించారు. సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేస్తున్నాయి. ఇక ఏపీలో బీజేపీ పార్ట్‌నర్‌ జనసేన GHMC బరిలో ఒంటరిగా పోటీ చేయనుంది. బీజేపీ కలసి వచ్చే అవకాశాలు లేకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేయనుంది. శుక్రవారం ఉదయం తన తొలి జాబితా ప్రకటించనుంది.



కొత్తవారికి అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ : –
మొదటి జాబితాలో సిట్టింగ్‌లకే ప్రాధాన్యం ఇచ్చిన TRS… రెండో జాబితాలో కొందరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. డిప్యుటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ నియోజకవర్గం సికింద్రాబాద్‌ పరిధిలో మూడు సిట్టింగ్‌ స్థానాలను కొత్తవారికి కేటాయించింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్‌నగర్‌లోనూ కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. ఇటు పార్టీ టికెట్లు దక్కక అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలను బుజ్జగించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రామచంద్రాపురం సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌ను మంత్రి హరీశ్‌రావు బుజ్జగించారు.



బుజ్జగింపులు : –
పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో మధ్యాహ్నం అంజయ్య బీజేపీలో చేరారు. మళ్లీ హరీశ్‌రావు బుజ్జగింపులతో సాయంత్రానికి తిరిగి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మరోవైపు… వెంగల్‌రావ్ నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మనోహర్.. కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. టీఅర్ఎస్ నుంచి టికెట్ కన్ఫామ్ కాకపోవడంతో.. ఆయన బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.