GHMC ఎన్నికలు : స్టే ఇవ్వలేమన్న హైకోర్టు, కారును పోలిన గుర్తు ఇవ్వొద్దన్న టీఆర్ఎస్

  • Published By: madhu ,Published On : November 16, 2020 / 11:51 PM IST
GHMC ఎన్నికలు : స్టే ఇవ్వలేమన్న హైకోర్టు, కారును పోలిన గుర్తు ఇవ్వొద్దన్న టీఆర్ఎస్

GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయ్.. ఇప్పుడిదే… జనాల నోళ్లలో నానుతున్న ప్రశ్న. ఓవైపు ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తుంటే… న్యాయస్థానాల్లో పిటిషన్లు పడుతున్నాయి. అయితే.. గ్రేటర్‌ ఎన్నికలపై స్టే ఇవ్వబోమని హైకోర్ట్ స్పష్టం చేసింది. మరోవైపు… నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తుంటే… కారును పోలిన గుర్తు ఎవరికీ కేటాయించొద్దంటూ.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.



హైకోర్టు కీలక వ్యాఖ్యలు : –
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే.. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రేటర్ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తీర్పు చెప్పింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పిల్ దాఖలు చేశారు.



నేరచరిత్ర ఉన్న వారికి టికెట్లు వద్దు : –
సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిల్‌లో పేర్కొన్నారు. రాజకీయంగా వెనకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏంచేశారని హైకోర్టు ప్రశ్నించింది. పిల్‌పై విచారణ జరపుతాం కానీ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
మరోవైపు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో.. నేరచరిత్ర ఉన్న అభ్యర్థులకు పొలిటికల్ పార్టీలు టికెట్లు ఇవ్వద్దంటూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేస్తోంది.



72 మంది కార్పొరేటర్లపై కేసులు : –
2016లో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన 72 మంది కార్పొరేటర్లపై ఉన్న కేసుల వివరాలను ఆ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పాలకమండలిలో 20మందిపై నేర చరిత్ర ఉన్నట్లు సంస్ధ ప్రతినిధులు చెబుతున్నారు. 2016 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల్లో టీడీపీ 13, టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 13, బీజేపీ 4, 11 మంది ఇండిపెండెంట్ అభ్యర్ధులపై కేసులు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. వీరిలో 8 మంది మహిళలు కూడా ఉన్నారు.



గుర్తులపై అభ్యంతరాలు : –
ఓవైపు.. ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తుంటే అధికారులతో టీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కారు గుర్తును పోలిన గుర్తుల్ని ఎవరికీ కేటాయించవద్దని కోరింది. తమ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని పోలిన గుర్తుల వల్ల తాము నష్టపోతున్నామని ఈసీకి ఫిర్యాదు చేశారు. కొన్ని గుర్తులపై అభ్యంతరం వ్యక్తంచేశారు. జరగబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో వాటిని తొలగించాలని విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో జరిగిన తేడాను ఈసీకి వివరించారు.



టీఆర్ఎస్ శ్రేణులతో హరీశ్ భేటీ : –
మరోవైపు… మంత్రి హరీశ్‌రావు గ్రేటర్ పరిధిలోని పటాన్‌చెరు నియోజకవర్గం టీఆర్ఎస్ శ్రేణులతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై శ్రేణులకు మార్గదర్శనం చేశారు. బీజేపీ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ పార్టీకి ఓట్లే ముఖ్యం అని.. ప్రజా సంక్షేమం పట్టదని మండిపడ్డారు.



ఓటర్ల జాబితా : –
గ్రేటర్ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తుంటే రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా… 150 డివిజన్ల పరిధికి సంబంధించి ఓటర్ల జాబితా విడుదల చేసింది. జాబితలో 74లక్షల 4వేల 286 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషుల సంఖ్య 38లక్షల 56వేల770గా ఉంది. అన్ని డివిజన్లలో కలిపి 35లక్షల 46వేల847 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మైలార్ దేవరపల్లిలో అత్యధికంగా 79 వేల 290 మంది ఓటర్లుండగా, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27వేల998మంది ఓటర్లున్నారు. తుదిజాబితాలో ఓటర్లు తమ పేరు పరిశీలించుకోవాలని, జాబితాలో పేరు లేకపోతే..ఫామ్‌ 6 పూరించి దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.