TRS బహిరంగసభ ఏర్పాట్లు పూర్తి, 2.5 లక్షల మంది సమీకరణ!

  • Published By: madhu ,Published On : November 28, 2020 / 06:40 AM IST
TRS బహిరంగసభ ఏర్పాట్లు పూర్తి, 2.5 లక్షల మంది సమీకరణ!

CM KCR Speech

TRS Public Meeting In LB Stadium : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. బల్దియా ప్రచార పర్వంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ 2020, నవంబర్ 28వ తేదీ శనివారం అడుగుపెడుతన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇన్నిరోజులు టీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికల ప్రచార బాధ్యతలను కేటీఆర్‌ ఒంటిచేత్తో నిర్వహించారు.



నియోజకవర్గాల వారీగా మంత్రులూ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇవాళ ఏకంగా గులాబీ బాస్‌ సీన్‌లోకి ఎంటరవుతున్నారు. ఎల్‌బీ స్టేడియం వేదికగా గ్రేటర్‌ జనాలకు తాము చేయబోయేది వివరించనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ ప్రచార సభను జన సమీకరణ లోపంతో చివరి నిముషంలో రద్దయ్యింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ శ్రేణులు నేటి బహిరంగ సభకు జనసమీకరణ భారీగా చేస్తున్నాయి. పార్టీ ముఖ్యులు జన సమీకరణపై దృష్టి పెట్టారు. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని…. జనాలను తరలించేందుకు వ్యూహాలు రెడీ చేశారు.



https://10tv.in/modis-visit-to-hyderabad-protocol-differs/
గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటున్న ఏకైక సభ ఇది. ప్రచార గడువు ముగియడానికి సరిగ్గా 24 గంటల ముందు భారీ స్థాయిలో సభను నిర్వహిస్తోంది టీఆర్‌ఎస్‌. దీంతో కేసీఆర్‌ సభను విజయవంతం చేయడంపై పార్టీ నేతలంతా నిమగ్నమయ్యారు. ఈ సభ సక్సెస్‌ చేయడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు తీసుకెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎల్‌బీ స్టేడియం సాధారణ జన సామర్థ్యం 50వేలు. జనాలు కిక్కిరిసిపోతే 75వేల వరకు ఉంటుంది. అయితే స్టేడియం నిండడంతోపాటు….. బయటకూడా జనం పోటెత్తాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఈసభకు రెండు నుంచి రెండున్నర లక్షల మందిని సమీకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రతి డివిజన్‌ నుంచి 3వేల మందిని సభకు తరలించేంలా స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించారు. సభకు వాహనాల్లో తరలివచ్చే వారికి ఇబ్బంది లేకుండా స్టేడియం సమీపంలోనే పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు.



ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉండే గోషామహల్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుంచి పాదయాత్రలుగా జనాన్ని తరలించబోతున్నారు. అలా వచ్చిన వారు ఎటు వైపు నుంచి వస్తే, అటు వైపు నుంచే స్టేడియంలోకి అనుమతించాలని నిర్ణయించారు. సీఎం, మంత్రులు, వీవీఐపీలు, కార్పొరేటర్‌ అభ్యర్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దారుల్లో స్టేడియంలోకి రానున్నారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉచితంగా పంపిణీ చేయడానికి 2 లక్షల మాస్క్‌లను సిద్ధం చేశారు.



ఎల్‌బీ స్టేడియంలో సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. ఏర్పాట్లను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. సభా వేదిక, సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌ను చెక్‌చేశారు. పార్టీ నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై నుంచి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అదే వేదికపై మంత్రులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇక కుడి వైపున కళాకారుల ప్రదర్శనల కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఎడమవైపున టీఆర్‌ఎస్‌ తరపున జీహెచ్‌ఎంసీలో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా కూర్చోవడానికి మరో వేదికను రెడీ చేశారు. స్టేడియంలోపల , వెలుపల ఆరు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు.



టీఆర్‌ఎస్‌ సభ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 3 గంటల నుంచి ఎల్బీ స్టేడియం వైపు వాహనాలకు ఎంట్రీ ఉండదు. వివిధ ఏరియాల నుంచి వచ్చే వాహనాల కోసం పలుచోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. సభను ఆరు గంటలకు ముగించేలా టీఆర్‌ఎస్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.