అమ్మో ఒకటో తారీఖు : బండెడు కష్టాల్లో బల్దియా

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 02:30 PM IST
అమ్మో ఒకటో తారీఖు : బండెడు కష్టాల్లో బల్దియా

GHMC

GHMC in trouble over Bills and salaries : బల్దియా బండెడు కష్టాల్లో ఉందా.. ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించడమే భారంగా మారిందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జీతాలే కాదు.. బిల్లుల చెల్లింపులు కూడా కష్టంగా మారింది. దీంతో… ముందున్న కొత్త ప్రాజెక్టుల పరిస్థితిపై డైలమా నెలకొంది. ఒక‌ప్పుడు కాసుల‌తో గ‌లగ‌ల‌లాడిన జీహెచ్ఎంసీ ఖజనా.. ఇప్పుడు వెలవెలబోతోంది. వరదలు, వర్షాల కారణంగా బల్దియా సిబ్బంది ఇతర పనులపై ఫోకస్ పెట్టడంతో… కార్పొరేషన్‍‌కు ఆదాయం తగ్గిపోయింది.



పిక్స్‌డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. పన్నుల వసూళ్లు మందగించాయి. కొత్త ప్రాజెక్టులు భారంగా మారిపోతున్నాయి. ఇన్ని సమస్యల మధ్య.. సిబ్బంది జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిపోయింది. ఒకటో తారీఖు వస్తోందంటేనే… ఉద్యోగుల్లో, అధికారుల్లో ఆందోళన మొదలవుతోంది. ఏ బిల్లు ఆపాలి.. ఏ బిల్లు పాస్ చేయాలి అంటూ ఫైనాన్స్ విభాగం ఒక‌టికి నాలుగు సార్లు చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.



రోడ్డు డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్టుల‌కు, కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటేనెన్స్ ప్రాజెక్టుకు అయ్యేనిధులను జీహెచ్ఎంసీ అప్పుల రూపంలో సేకరిస్తోంది. మిగతా వాటికి ట్యాక్సులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం నుంచి ఖర్చు చేయాలి. జీతాలు, పెన్షన్లు, మెయింటేనెన్స్ కోసం ప్రతినెలా 150 కోట్ల వరకు ఖర్చవుతుంది. నాలాలు, భవనాల నిర్మాణాల కోసం ప్రతినెలా బిల్లులు దాదాపుగా 40 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు బల్దియాకు గుదిబండగా మారాయి.



https://10tv.in/central-government-send-back-disha-bill-to-ap-government/
కరోనా.. అనంతరం వరదలు, వర్షాలతో బల్దియా సిబ్బంది మొత్తం ఆ పనుల్లోనే మునిగిపోయారు. దీంతో.. పన్నుల వసూళ్లు ఆగిపోయాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీ అయింది. గతంలో ప్రతినెలా ఒకటో తేదీన సిబ్బంది అకౌంట్లలో జీతం పడేది. కానీ.. ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేంతగా పరిస్థితి పడిపోయింది. సర్కిళ్ల వారీగా.. విడతల వారిగా సిబ్బందికి జీతాలు చెల్లిస్తూ అడ్జెస్ట్ చేస్తున్నారు అధికారులు.



ఖజానా ఖాళీ అవడంతో మెయింటేనెన్స్ కాంట్రాక్టర్లకు ఆగస్ట్ నుంచి బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. వారికి ఇవ్వాల్సినవే సుమారు 150 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు పూర్తి చేసి నెల‌లు గ‌డుస్తున్నా.. బిల్లులు క్లియర్ కాకపోవడంతో… కాంట్రాక్టర్లు బల్దియా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కాంట్రాక్ట్ వర్కర్ల వేతనాలకు సంబంధించిన బిల్లులను కూడా అధికారులు తిప్పిపంపుతున్నారు.



ఇక అత్యవసర ఖర్చులకు జనరల్ ఫండ్ నుంచి వాడుతున్నా.. అవి సరిపోవడం లేదు. మరోవైపు వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా ఆస్తి పన్ను బకాయిలు, వడ్డిపై 90శాతం రాయితీ ఇచ్చారు. వాటి ద్వారా 1500 కోట్ల రూపాయలు వసూలవుతాయని భావించినా… ఇప్పటి వరకు కేవలం 230 కోట్లే వచ్చాయి. దీంతో… నిధులు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాక బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.