ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు : హైదరాబాద్‌లో బస్‌ షెల్టర్లు లేక రోడ్లపైనే పడిగాపులు

ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు : హైదరాబాద్‌లో బస్‌ షెల్టర్లు లేక రోడ్లపైనే పడిగాపులు

ghmc neglects bus shelters and bus stops : హైదరాబాద్‌లో ఆర్టీసీనే నమ్ముకున్న వారికి కష్టాలు తప్పడం లేదు. జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నా.. పరిష్కారం మాతం దొరకడం లేదు. మరి ప్రయాణికుల కష్టాలేంటి..? అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి..? హైదారాబాద్‌లో ప్రయాణం అంటేనే రోజురోజుకు అవ‌స్థలు పెరుగుతున్నాయి. ఓ వైపు సౌక‌ర్యాల కొర‌త‌.. మ‌రోవైపు ట్రాఫిక్ జామ్‌లు.. ఇక ఆర్టీసీ బ‌స్సుల్లో ప్రయాణం అంటే అదో పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. మాములుగానే బస్సు కోసం చాలాసార్లు వెయిట్‌ చేయాలి. వెయిట్‌ చేసే ఓపిక ఉన్నా.. బ‌స్ స్టాపుల వ‌ద్ద క‌నీస సౌక‌ర్యాలు లేక సిటిజ‌న్స్ ఇబ్బందులు ప‌డుతున్నారు.

పలు ప్రాంతాల్లో బస్ షల్టర్లు అసలే లేవు.. ఉన్న కొద్ది వాటిలో షల్టర్ల వద్ద కూర్చోవడానికి సీట్లు ఉండటం లేదు.. ఇక విషయానికి వస్తే.. రాబోయే ఎండాకాలంలో సిటీలో ఆర్టీసీ బస్సులనే నమ్ముకున్న వారికి మరింత కష్టాలు తప్పేలా లేవు. ఇప్పుడిప్పుడే ఎండలు పెరగుతుండగా.. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. మండే ఎండల్లోనూ ప్రయాణికులు బస్టాపుల వ‌ద్ద ఎలాంటి ఎండలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పేలా లేదు.

గ్రేటర్‌లో సంవత్సరాలు గడుస్తున్నా.. బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తికావడం లేదు. 2008లో షెల్టర్ల నిర్మాణల బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది ఆర్టీసీ. నగరంలో మొత్తం 1 వేయి 832 బస్ స్టాప్‌లు అవ‌స‌ర‌మ‌ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు.. ప్రతిపాదనలను బల్దియాకు పంపారు. యాడ్ ఏజెన్సీల ద్వారా బ‌స్టాప్‌ల నిర్మాణాలు చేపట్టల‌ని నిర్ణయించారు. ఆర్టీసీ అధికారులు గుర్తించిన అన్ని షెల్టర్లు నిర్మించేందుకు యాడ్ ఏజెన్సీలకు పనులు అప్పజెప్పారు. 2018 నుంచి గ్రేటర్ పరిధిలో కొత్త బస్ షల్టర్ల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. సిటీలో 30 ఏసీ బస్ షల్టర్లు నిర్మాణం చేయాలని నిర్ణయించిన అధికారులు.. కేవలం ఐదింటిని మాత్రమే పూర్తి చేశారు. అందులోనూ ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదంటున్నారు ప్రయాణికులు.

ఇక వివిధ ప్రాంతాల్లో బ‌స్ సెల్టర్ల నిర్మాణానికి ముందుకు వ‌చ్చిన యాడ్ ఏజెన్సీలు.. ఎక్కడైతే ఎక్కువ యాడ్స్‌పై ఆదాయం వస్తుందో అక్కడే బస్ షెల్టర్లు నిర్మించాయి. మిగిలిన ప్రాంతాల్లో క‌నీసం నిర్మాణాలు కూడా ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు ఒకటి లేదా రెండు షెల్టర్లు అవసరమని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించిన దగ్గర పరిమితికి మించి షెల్టర్లు ఏర్పాటు చేశాయి కొన్ని యాడ్ కంపెనీలు. కొన్నిచోట్ల బసులు నిలవకపోయినా ప్రకటనల ద్వారా మంచి ఆదాయం వస్తుందనుకుంటే.. అక్కడ బస్ షల్టర్లు నిర్మించేశారు. సిటీలో అధికారిక లెక్కల ప్రకారమే వందల బ‌స్ ష‌ల్టర్ల కొర‌త ఉంది. బల్దియా అధికారుల చర్యలతో.. ఆర్టీసీ ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదనే విమర్శలున్నాయి.

హైద‌రాబాద్ ప‌రిధిలో ప్రతి రోజు ల‌క్షకు పైగానే ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే గ్రేట‌ర్ ప‌రిధిలో మాత్రం సిటిజ‌న్స్‌కు స‌రిప‌డా బ‌స్టాపులు ఏర్పాటు చేయడంలో అటు ఆర్టీసీ.. ఇటు జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫ‌లమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదాయంపైన పెట్టిన శ్రద్ధ.. ప్రయాణికుల సమస్యలపై పెట్టడం లేదనే విమర్శలున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు ఈ అంశం పై ఫోకస్ చేస్తారో లేదో చూడాలి మరి..