జీహెచ్ఎంసీ నూతన పాలకమండలి, ప్రమాణస్వీకారం ఎప్పుడో..సెంటిమెంట్ అడ్డు

జీహెచ్ఎంసీ నూతన పాలకమండలి, ప్రమాణస్వీకారం ఎప్పుడో..సెంటిమెంట్ అడ్డు

GHMC new governing body : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుపడనుందా? మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగవా? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బల్దియా పాలక మండలి సమావేశం వీలౌతుందా? ఓ వైపు ఆమావాస్య, మరో వైపు బడ్జెట్ సమావేశాలతో.. మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జీహెచ్‌ఎంసీకి గతేడాది డిసెంబర్‌ 1 ఎన్నికలు జరిగితే, 4న ఫలితాలు వచ్చాయి. ఆ వెంటనే నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా ఆశించారు. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోయేసరికి మేయర్, డిప్యుటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. రెండు నెలలు దాటిన తర్వాత నూతన కార్పొరేటర్ల ప్రమాణానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 11న..ఉదయం 11 గంటలకు నూతన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం నిర్వహించ తలపెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. కానీ ఆ రోజు అమావాస్య ఉండడంతో ప్రమాణ స్వీకారోత్సవంపై తర్జనభర్జన పడుతున్నారు కార్పొరేటర్లు. ఈ అంశంపై ఇప్పటికే బల్దియా మున్సిపల్‌ కమిషనర్‌ను కొంతమంది కార్పొరేటర్లు కలిసి చర్చించారు.

నూతన కార్పరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన వెంటనే 11న మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యుటీ మేయర్‌ ఎన్నిక ఉంటుంది. అయితే ఓ వైపు అమావాస్య సెంటిమెంట్‌కు తోడు, మరోవైపు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండడం కూడా అడ్డంకిగా మారనుందనే వాదన వినిపిస్తోంది. సాధారణంగా పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల సమావేశాలు జరగవు. దీనికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు…లోకల్‌ బాడీల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు. మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నికల్లో వీరి ఓట్లు చాలా కీలకం. టీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌…ఈ మూడు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఓట్లకు ఇంకా ప్రాధాన్యత ఏర్పడింది.

పార్లమెంట్‌ జరుగుతున్న కాలంలో… ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకునే వీలుండదు. దీంతో జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం ఉండకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికయితే పూర్తి స్పష్టత రాలేదు. కానీ.. తొలి రోజు కోరం లేకపోతే మరుసటి రోజు సమావేశం నిర్వహిస్తామంటున్నారు అధికారులు. మేయర్‌, డిప్యుటీ మేయర్ ఎన్నికలు వాయిదే వేసే ప్రసక్తే లేదంటున్నారు. మొదటి రోజు ప్రమాణ స్వీకారం చెయ్యనివారు రెండోరోజు చేయొచ్చు. అయితే మొదటి రోజే మేయర్ ఎన్నిక జరిగితే.. మరో సమావేశంలోనే లేదా, తన ఛాంబర్‌లోనో మిగిలిన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయిస్తారు మేయర్. ముందుగా ప్రమాణస్వీకారం చేసేవారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. దీంతో అమావాస్య సెంటిమెంట్‌తో 11న ప్రమాణస్వీకారం చేయకపోతే రెండో రోజు మేయర్‌ ఎన్నిక నిర్వహించే అవకాశాలే ఎక్కువున్నాయి.