కొలువుదీరిన జీహెచ్ఎంసీ పాలకమండలి..నాలుగు భాషల్లో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం

కొలువుదీరిన జీహెచ్ఎంసీ పాలకమండలి..నాలుగు భాషల్లో కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం

GHMC new Governing Body : ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ కొత్త పాలకమండలి కొలువుదీరింది. నూతన కార్పొరేటర్లు అందరూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లో ఒకేసారి ప్రమాణం చేశారు. తెలుగు, హిందీ, ఊర్దూ, ఇంగ్లీష్ బాషల్లో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. 149 మంది కార్పొరేటర్లతో ఎన్నికల అధికారి శ్వేతా మహంతి ప్రమాణస్వీకారం చేయించారు. ఇవాళ మధ్యాహ్నం 12.30గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది.

ఇక మేయర్ స్థానం కోసం బరిలో టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ కూడా నిలిచింది. టీఆర్ఎస్ నుంచి గద్వాల విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా.. మోతే శ్రీలతారెడ్డిని డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి ప్రత్యేక బస్సుల్లో వచ్చారు.

బీజేపీ నుంచి ఆర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్‌రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. బషీర్‌బాగ్‌లో అమ్మవారిని దర్శించుకున్న కమలం కార్పొరేటర్లు.. జీహెచ్ఎంసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. అటు ఎంఐఎం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు మేయర్, డిప్యూటీ మేయర్‌ పోటీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కార్పొరేటర్లతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

గతేడాది డిసెంబర్ లో ఎన్నికలు జరుగగా… 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. నిన్నటితోనే జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ నూతన పాలకమండలి ఎన్నిక నిర్వహించారు. మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని ఫిక్స్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సభ్యుల హాజరును బట్టి ఉదయం 11గంటల నుంచి ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతమహంతి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ నాలుగు భాషల్లో కార్పొరేట్లర్లు ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తర్వాత.. 12గంటల 30నిమిషాలకు మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు.

గ్రేటర్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 150. అయితే.. లింగోజిగూడ డివిజన్‌ అభ్యర్థి మృతితో 149 మంది సభ్యులయ్యారు. ఇక ఎక్స్‌అఫీషియో సభ్యులు 44 మందిని కలిపితే 193 అవుతుంది. అయితే.. మేయర్ ఎన్నిక నిర్వహించాలంటే మొత్తం 193మంది సభ్యుల్లో 50 శాతం మంది సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. అలా 97మంది సభ్యులు సమావేశంలో పాల్గొంటే మేయర్ ఎన్నిక కార్యక్రమాన్ని ప్రిసైండింగ్ అధికారి నిర్వహిస్తారు. 97 మంది హాజరై పూర్తి కోరం ఉంటేనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక పూర్తవుతుంది. కోరం లేకపోతే మరుసటి రోజుకు ఎన్నికను వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా పూర్తి కోరం లేకపోతే మూడో సమావేశంలో హాజరైన సభ్యుల్లో ఎక్కువమంది మద్దతు ఎవరికుంటే వారిని మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ప్రకటిస్తారు.

గ్రేటర్ పరిధిలో అత్యధికంగా టీఆర్ఎస్‌కు 56మంది కార్పొరేటర్లున్నారు. 32మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. డీఎస్ కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన ఇవాళ సమావేశానికి హాజరు కాకుంటే.. సంఖ్యా బలం 87 అవుతుంది. ఇక బీజేపీకి 47మంది కార్పొరేటర్లు.. ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఆ లెక్కన బీజేపీ సభ్యుల సంఖ్య 49గా ఉంది. ఎంఐఎం 44 డివిజన్లు గెల్చుకోగా… 10మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. వారి సంఖ్య 54కు చేరుతుంది.

https://youtu.be/dAtwazY7kiE